రాష్ట్రంలో 14నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా..? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురి చేయడం ఎంత వరకు న్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు రోటిన్ గా చెల్లించాల్సిన బిల్లులలో సీలింగ్ పెట్డడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాయితీగా పని చేసే ఉద్యోగులకు ఏ సందేశం ఇస్తున్నట్టు..? కళాశాలల యాజమాన్యాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టేక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఆశ చూపి 14నెలలుగా రూ.56వేల బకాయి పడి యువతను దగా చేసారని ఆరోపించారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా.. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలంటూ కిషన్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.