నా రాణివి అవుతావా అన్నాడు.. వెంటనే దండలు మార్చుకున్నాం..!

-

పైన ఫోటోలో చూశారుగా మా ఫ్యామిలీని.. చిన్ని ఫ్యామిలీ.. కానీ చింతలు లేని ఫ్యామిలీ. మా దగ్గర డబ్బులు లేవు. కానీ.. ప్రేమానురాగాలు ఉన్నాయి. అవే మమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నాయి. మాది లవ్ మ్యారేజీ. మా పెళ్లికి పునాది అతడి చిరునవ్వే. అవును.. అతడి చిరునవ్వే నన్ను పడేసింది. ఎక్కడో టచ్ చేసింది. నాకు అతడు కనిపించేవాడు కాదు.. అతడి చిరునవ్వే కనిపించేది. అదే నాలో అలజడిని రేపింది. నన్ను ఏదేదో చేసింది.

మాది పేద కుటుంబం. రోజుకు మూడు పూటలు గడవాలంటే అందరూ పని చేయాల్సిందే. నేను కూడా ఓ టెక్స్ టైల్ ఫ్యాక్టరీలో పనిచేసేదాన్ని. ఫ్యాక్టరీలో బిల్డింగ్ కట్టడానికి చాలా మంది మేస్త్రీలు వస్తుండేవారు. అందులోని ఓ వ్యక్తి మాత్రం నన్ను చూసి నవ్వుతుండేవాడు. ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ప్రతి రోజు నవ్వుతుండేవాడు. దీంతో నేను కూడా అతడిని చూసి ఏదో అలా నవ్వేదాన్ని. అయిష్టంగానే సుమా. కానీ.. అతడి చిరునవ్వంటే నాకు ఇష్టం. కానీ.. అమ్మాయిని కదా బయటికి ఎలా చెప్పేది. అందుకే.. అతడిని పట్టించుకునేదాన్ని కాదు. మధ్యాహ్నం అన్నం తినే సమయంలో మాకన్నా కొంచెం దూరంగా కూర్చొని తింటూ నావంకే చూసేవాడు. రోజూ అదే తంతు. అలా.. నేను కూడా అతడిని చూడటం మొదలు పెట్టా. చూపులే తప్ప మాటల్లేవు మామధ్య.

ఫ్యాక్టరీలో బిల్డింగ్ కట్టడం పూర్తయింది. కానీ.. అతడు మాత్రం ఫ్యాక్టరీకి రావడం మానలేదు. నన్ను చూడటానికే వచ్చేవాడు. భోజన సమయంలో అక్కడే కూర్చొని నన్ను చూస్తూ ఉండేవాడు. నేనే ఉండబట్టలేక.. ఓరోజు అతడి వద్దకు వెళ్లాను. దీంతో నన్ను ఫ్యాక్టరీ నుంచి బయటికి తీసుకెళ్లాడు. దగ్గర్లో ఉన్న ఓ మ్యూజియంకు తీసుకెళ్లాడు. ఆ మ్యూజియంలో రాజుల కాలం నాటి ఆయుధాలు ఉన్నాయి. వాటిని చూస్తున్నాం. వాటిని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతలో.. నా రాణివి అవుతావా నువ్వు.. అంటూ అడిగాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యా. వెంటనే ఎప్పుడూ అనేశా. అంతే.. నువ్వు ఎప్పుడంటే అప్పుడే నా రాణివి కావచ్చు.. అంటూ అతడి నుంచి సమాధానం వచ్చింది. అంతే.. మరుక్షణం ఆలోచించలేదు. అక్కడే దండలు మార్చుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. కాపురం పెట్టాం. అలా సడెన్‌గా జరిగిపోయింది.

నాకేమో రోజంతా అతడితోనే ఉండాలని కోరిక. కానీ.. అతడు ఇంట్లో ఉంటే కుదరదు కదా. రోజూ పనిచేస్తేనే మూడు పూటలు గడుస్తాయి మాకు. ఆ దేవుడి దయ వల్ల మాకు పాప పుట్టింది. ఆల్ హ్యాపీస్. చూశారుగా.. మా హ్యాపీ ఫ్యామిలీ ఫోటోను. నా జీవితం వీళ్లే. వాళ్లను చూస్తూ.. వాళ్లతో గడుపుతూ నా జీవితాన్ని ఇలా జీవిస్తున్నాను. నాకు నచ్చిన జీవితం కూడా ఇదే. అందుకే మా దగ్గర డబ్బులు పెద్దగా లేకపోయినా.. పేదరికం అనేది మమతానురాగాల ముందు ఓడిపోయింది. అదండి.. మా స్టోరీ. ఇంతసేపు ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.. ఉంటాను.. మా ఆయన వచ్చే టైమ్ అయింది.. సెలవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version