వావ్.. ట్రాఫిక్ నుంచి కరెంట్ తయారీ.. ఇంట్రస్టింగ్ కాన్సప్ట్..!

ప్రస్తుతం ఆంధ్రాలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. టైంతో సంబంధం లేకుండా గంటలకొద్దీ.. కరెంట్ కట్ చేస్తున్నారు. ప్రభుత్వాల దగ్గర దీనికి సంబంధించి కారణాలు ఎన్ని ఉన్నా.. ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ ఉత్పత్తికి ప్రభుత్వాలు ప్రత్యామ్యాయ మార్గలపై దృష్టిపెడితే సమస్య ఇంతలా ఉండదు.. ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తోంది.. టర్కీ. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద సిటీల్లో ట్రాఫిక్ సమస్య ఎంతలా ఉంటుందో మనకు తెలుసు.. మనం ఇలాంటి టెక్నిక్ వాడితే.. ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఇంతకీ ట్రాఫిక్ తో కరెంట్ ఎలా అనేగా మీ డౌట్..! చూద్దాం పదండి.!
టర్కీ నగరం ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రయోగం చాలా మంచింది. అక్కడి రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరం పైన సోలార్ పవర్ ప్లేట్ ఉంటుంది. అది సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తోంది. ఇక పరికరానికి ఫ్యాన్ రెక్కల లాంటి మూడు రెక్కలుంటున్నాయి. అవి వంపు తిరిగి ఉంటున్నాయి.
ఆ రెక్కలతో ఉన్నవి విండ్ టర్బైన్స్. ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు గాలి ఎక్కువగా వస్తుంది కదా.. ఆ గాలి… పరికరానికి ఉన్న రెక్కలకు తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది. దాంతో… పవర్ ఉత్పత్తి అవుతుంది. భలే సింపుల్ గా ఉంది కదూ.. ఇస్తాంబుల్‌లో 2021లో దీన్ని అమల్లోకి తెచ్చారు. ఇలా ఉత్పత్తి అయ్యే కరెంటుతో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. ఇంకా మిగిలిన కరెంటును వేరే అవసరాలకు ఉపయోగిస్తున్నారు.
ఈ నిట్టనిలువు టర్బైన్లను ENLIL అంటారట.. వీటిని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్శిటీతో కలిసి… టెక్ సంస్థ డెవెసిటెక్ తయారుచేసింది. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. అంతేకాదు… ఇవి భూకంపాల్ని గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్ డై-ఆక్సైడ్ స్థాయి ఎంత ఉందో కనిపెడతాయి. ఈ యంత్రాలకు లోపల ఉన్న బ్లేడ్స్… గంటకు 1 కిలోవాట్ కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే ఒక్కో పరికరం… రెండు ఇళ్లకు సరిపడా కరెంటును ఒక రోజులో ఉత్పత్తి చేస్తుందనమాట.

ఇండియాలో కూడా ఇలాంటిది ఉంటే..

ఇలాంటివి ఇండియాలో ప్రారంభిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన దేశంలో కరెంటు విపరీతంగా వాడతాం. విశాలమైన రోడ్లు ఉన్నాయి. వాహనాల ట్రాఫిక్ ఎక్కువే. కాబట్టి కంటిన్యూగా కరెంటు ఉత్పత్తి చెయ్యవచ్చు. రైల్వే లైన్ల పక్కన కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. గాలి విపరీతంగా వచ్చే ఎత్తైన ప్రదేశాల్లో ఇవి సెట్ అవుతాయి. అప్పుడు కరెంటు కోతల సమస్యే ఉండదు.
ఎప్పుడూ పాత పద్దతిలోనే కాకుండా.. సమస్యకు కొత్త ఆలోచనలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వీటికి పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం. యువత వల్లే ఇలాంటి ఆలోచనలు సాధ్యమవుతాయంటున్నారు నిపుణులు. మన దగ్గర కూడా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేయగలిగే సత్తా ఉన్న యువతీయువకులు ఉన్నారు. వారికి ఆర్థికభరోసా ఇస్తే.. మంచి మంచి ఆవిష్కరణలు చేసి చూపెడతారు. మీరేమంటారు..?
– Triveni Buskarowthu