తల్లిదండ్రులు పిల్లలను కనేటప్పుడు వారికి చెప్పే కంటారా ? మిమ్మల్ని కనాలా, వద్దా ? అని తల్లిదండ్రులు ఎక్కడైనా పిల్లల్ని అడుగుతారా ? ఏంటీ అర్థం పర్థం లేని ప్రశ్నలు ? అని అనుకుంటున్నారా ? ఏమీ లేదండీ.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి సరిగ్గా ఇవే ప్రశ్నలను తన తల్లిదండ్రులకు వేస్తున్నాడు. అసలు తనను ఎందుకు కన్నారని, కనేముందు తనకు చెప్పి ఉండాల్సిందని అంటున్నాడు అంతేకాదు, తన ఇష్టం తెలుసుకోకుండా, తన ప్రేమయం లేకుండా తనను కన్నందుకు గాను తన తల్లిదండ్రులపైనే అతను కోర్టులో కేసు వేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ముంబైకి చెందిన రఫెల్ శామ్యూల్ అనే వ్యక్తి యాంటీ-నటలిజం (anti-natalism) భావాలు ఉన్నవాడు. అందుకే ఆ గ్రూప్ పేరిట కొందరు యాక్టివిస్టులతో కలసి అతను పనిచేస్తున్నాడు. సమాజంలో తల్లిదండ్రులు పిల్లల్ని కనకూడదని, భూమికి భారమని, భూమిపై ఉన్న సహజ వనరులు తగ్గిపోతున్న దృష్ట్యా పిల్లల్ని కనకూడదని, అనవసరం వారిని చదువు, కెరీర్, పెళ్లి అని చెప్పి కష్టాల్లోకి నెట్టవద్దని.. తదితర భావాలతో ఈ గ్రూప్ పనిచేస్తుంది. అందుకే ఈ గ్రూప్ భావాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు కనుకనే శామ్యూల్ ఇప్పుడు తనను ఎందుకు కన్నారంటూ తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు.
తనకు ఇష్టం లేకుండా తనను తల్లిదండ్రులు కని ఈ భూమిపై పడేశారని, వారు తనకు మంచి లైఫ్ ఇచ్చినా, తాను ఇప్పుడు గొప్ప పొజిషన్‌లో ఉన్నానని.. అయినా ఒకరిని కనడం అంటే.. వారిని బలవంతంగా కష్టాల్లోకి నెట్టినట్లేనని, బానిసలుగా మార్చినట్లేనని శామ్యూల్ చెబుతున్నాడు. ఒక వ్యక్తిని కష్టాలు పెట్టే హక్కు మరొక వ్యక్తికి లేదని, తల్లిదండ్రులు కేవలం తమ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే పిల్లల్ని కంటారని, ఆ తరువాత పిల్లలు అనేక కష్టాలకు గురవుతారని, కనుక ఎవరూ అసలు పిల్లల్ని కనకూడని శామ్యూల్ అంటున్నాడు. అంతేకాదు.. భార్యభర్తలు పిల్లలు లేని చైల్డ్ ఫ్రీ జీవితాన్ని అనుభవించాలని అతను సెలవిస్తున్నాడు. ఇక శామ్యూల్ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో నిహిల్ ఆనంద్ పేరిట ఓ పేజీని కూడా నిర్వహిస్తున్నాడు. కాగా పైన చెప్పిన సదరు యాంటీ-నటలిజం గ్రూపు వారు ఈ నెల 10వ తేదీన బెంగళూరులో ఓ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. స్టాప్ మేకింగ్ బేబీస్ అనే గ్రూప్ ఈ మీటింగ్ బాధ్యతలను చూస్తోంది. ఇక చివరిగా శామ్యూల్ ఏమంటున్నాడంటే.. పిల్లలను కని వారిని కష్టాల్లోకి నెట్టేసే తల్లిదండ్రులకు వారి పిల్లలు ఏ విధంగానూ రుణపడి ఉండరని అంటున్నాడు. ఏది ఏమైనా.. పుర్రెకో బుద్ది.. జిహ్వకో చాపల్యం.. అని పెద్దలు ఊరికే అనలేదు కదా..!