ఫస్ట్ కాజ్ :- నిన్నటి రాత్రి తనతో మాట్లాడుతూ మాట్లాడుతూ..
ఎప్పుడయినా హక్కులన్నీ రద్దయిపోయి..ఒక్కసారి నిలువ నీడలు కోల్పోయి..ఎక్కడో ఓ చోట బంధీ అయిపోవాలి..రాత్రి కోరికలు వెల్లడికి నోచుకోక..దాహార్తి తీరక ఏవయినా కొన్ని కన్నీళ్లను దాచుకోక అలా ఉండిపోవడం తన దేహంతో ఉండిపోవడం ఇష్టంగా చేయాల్సిన పని! దేహంపై కొన్ని లిపులు ఉంటాయి.దేహాల సరిహద్దుల దగ్గర కొన్ని నిషేధితాలూ ఉంటాయి. నా స్నేహితుడు, ఫీచర్స్ రైటర్ మాధవ్ అంటున్నాడు చెమడోడ్చడంలో స్వచ్ఛత నా దేహం అని..ఎలిజిబెత్ టేలర్ ను ఉద్దేశిస్తూ..
స్వచ్ఛత అంటే ఎలా ఉంటే అలా ఉండడం..లేదు ఎలా ఉన్నా అంగీకారానికి నోచుకోవడం..అతి సామాన్యతలో ఉన్నారు మీరు ఈ సామాన్యతను నేను ప్రేమిస్తున్నాను.రండి.. కొన్ని ముద్దులు ఇచ్చిపోండి అంటున్నదామె..ఏదయినా దేహాలపై అధికారాలను ఎల్లకాలం నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. రక్త స్రావాల చెంత నిర్బంధ కాలాల దగ్గర కోరికలు పూర్తిగా అమలుకు నోచుకోవు.తన నగ్నదేహం ముద్దాడుతూ నేను..తనతో నేను తనలో నేను..హృదయానికి ప్రేమ పరిమళాలను తన దేహం అదిపోయింది.. విశాలత్వం అన్నది ఇక ఉన్నదో లేదో అన్నది వెతుక్కోవాలి.. ఇలాంటి పరిణామం ఇలాంటి అగణితం ప్రేమ నుంచి కోరిక నుంచి పొందాలి.
ఒక చోట చదివేను..ఇష్టంగా పుట్టడం ఇష్టంగా చావడం..మళ్లీ ఇష్టతలను వెలివేసి పుట్టడం.. ఇష్టకామ్యార్థాలను ఎలా అర్థం చేసుకోవడం.. ధర్మం దేహానికి సంబంధితం అయి ఉంటే ప్రేమ ఆత్మల తాకట్టులో ఉందని అని అనుకోవడం తగని పని.. ప్రేమ ఆత్మల తాకట్టుకు పరిభాషగా మారితే శరీరం ఒకరి దగ్గర ఒక రాత్రిలో కరిగిపోవడం అన్నది జరగని పని.. ఎప్పుడో సారి నేను నాలా మారిపోవడం అన్నది చేయాల్సిన పని.. తన దగ్గరకుపోయాను.. కేవలం కోరికలను వెల్లడించి తనలో ఐక్యం అయిపోతే దేహంపై రాసిన రహస్య లిపికి అర్థం ఎలా వెతుక్కోవాలి.. ఇష్టంగానో ప్రేమగానో ఇచ్చిన ఈ ముద్దుల ఝంఝాటం ఉన్నట్లో లేనట్లో! చెరిపిపోయినంత ప్రేమ మనుషులలో లేదు.. చెదిరిపోయినంత దుఃఖమూ మనుషుల్లో లేదు..
సముద్రం దగ్గరకు పోయాను..తననూ తీసుకుని.. గాలి కెరటాల సయ్యాటల్లో తన కౌగిట కరిగిపోయాను.. రాత్రి వదిలేసిన కోరికలన్నింటినీ వివరించి చెప్పాను.. మళ్లీ ఒక పరి నన్ను ముద్దాడిపోయింది. ప్రేమ అయినా సంబంధిత బంధం అయినా ఈ ముద్దుల సడితోనే మొదలయి కొన్ని మనసుల్లో ఇంకిపోవడం అన్నది తరుచూ జరిగేనా! దేవుడు ప్రేమకు బానిసలుగా మనుషులను మలచడం మరిచిపోయి తన వర్గ శత్రువులను తానే తయారు చేసుకుంటు న్నాడు.. లేదా తానొక్కడే ఉండిపోవాలన్న ఒకే ఒక్క ధ్యాసతోనో లీలతోనో మిగతా వారిని శత్రువుగా చూపిస్తున్నాడు.. ప్రకృతిని త నలో ఐక్యం చేసి పిరియాడికల్ ఆర్డర్ ఒకటి స్త్రీ లో ఇంకించాడు.. ప్రకృతి ఆరాధనకు దూరంగా ఉంచి తన అవసరం తీర్చుకోవడం వరకే ఈ మగాడ్ని పరిమితం చేసి,ఒకింత పైచేసి సాధించాడు..
ఎక్కడున్నా ఈ తప్పిదాల గోల పోయేలా లేదు.. కనుక దేవాలయా ల్లో శృంగార సంబంధ కళాకృతులే బాగుంటాయి జీవితం అంత బాగుండదు.. ఈవేళ తన దగ్గరకు పోయి ఇదే చెప్పాను.. కోరికల్లో మనుషులు ఉన్నంత ఉన్నతంగా ఎక్కడా ఎప్పుడూ ఎల్లవేళలా ఉండలేరు అని.. ఫ్రాయిడ్ చెప్పాడు మనిషి.. ప్రేమలో మునిగి పె ళ్లిలో తేలుతాడు.. కలల్లో మునక.. అన్నది ఉమ్ముతడి.. కలల నుంచి బతుకు ఓ కట్టడి.. మనిషి ఇలా ఆలోచించక ఇంకా బతకాల న్న ఇచ్ఛనో స్వేచ్ఛనో పొందాలన్న ఒక్క కారణంతో ఎన్నో దేహాలను దురాక్రమణ చేస్తున్నాడు..
మళ్లీ తనతో మాట్లాడుతున్నాను.. నిన్న రాత్రి మాట్లాడుతున్నాను..దేహాలను లాలించేవాడు ఒకడు ఉన్నాడు అని చదివేను.. లాలించేవాడు ఎవడు అన్నది ప్రశ్న..రెండుంటాయి.. దేహం బొగ్గుల గని అయితే..ప్రేమ అనే వజ్రం ఎక్కడ దాగిపోయిందని దేహం పంజరం అయితే స్వేచ్ఛా,కోరికలు అన్నవి ఎందుకు అన్నింటా వెల్లడిలో ఉండలేకపోతున్నాయని ? ఏమీ కావు దేహం ఆకాశం..తన దేహం ఆకాశం అనుకున్న ప్రతిసారీ.. నేను చేరుకోవడం అంటే ఈ ఉప్పునీటి కెరటాలకు అవి సాధ్యం కాకపోవచ్చు.. ఈ కన్నీటి కెరటాలకు సాధ్యం కాకపోవచ్చు.
మీకు కావాలా ? ఈ దేహం మీలో ఐక్యం కావాలన్నంత ఇష్టం దానికుంటే తప్పక తీసుకోండి. దేహాలకు స్వేచ్ఛను ఇవ్వడం ఆత్మలకు నిర్బంధాలను ఆపాదించడం..మనం చేయాల్సిన పని..ఎవరు ఎలా ఉండాలో అలానే ఉండాలి..నేను మీలో ఐక్యం అయ్యేంత ఇష్టంతో ఉన్నాను..మట్టిలో మట్టి దేహంలో దేహం..ప్రాణంలో ప్రాణం..కొన్ని ముంగిట ముగ్గులు కొన్ని రంగులు ..కొన్ని కలలు ఉదయం ఇంటికి కలవరపెడుతున్న వేళ..తన దేహంలో ఐక్యం అవుతూ రాస్తున్నానొక మార్నింగ్ రాగా..
ఇష్టంగా పుట్టుండక పోతే..తెలియదు ఇష్టంగా పుట్టడం అన్నది మన చేతుల్లో లేని పని..ఇష్టంగా పెరిగి ఉండకపోతే ఏమో రెక్కలు విరిచేసి గదుల్లో బంధీలుగా మార్చేసి నచ్చిన విధంగా ఉండనీయక పోవడం అంటే అదొక శిక్ష..ఆత్మలను తాకట్టు పెట్టి శరీరాలను అర్పణగా మగాడి ముందు ఇచ్చిన కొన్ని స్త్రీ దేహాలకూ తనకూ ఎంతో తేడా.. తన దేహంతో సంభాషిస్తుంటే కొత్త శక్తికి, కొత్త ఉత్పాత శక్తి మధ్య పునరుత్తేజితాలను ఏవో చూస్తాను..తనతో కేవలం శృంగారం తనలో కేవలం కోరికలు రాజేయడం అన్నవి తగని పని..
దేహ చావిళ్లలో ఏమయినా ఉన్నాయా లేదా చదివించిన పేజీలలో లెక్కకు మిక్కిలి ప్రేమ లేదు. ప్రేమ సంబంధ కోరికలు లేవు కోరికల ప్రాప్తి లేదు. ఏమయినా సాధించాలన్న తపనా లేదు. కనుక తన దేహపు పుటల్లో ఆ పూట ఉంటే చాలు..ఏమీ వొద్దు.. ఆ దారుల్లో తన నవ్వు ఓ దీప కాంతి..జగదిలో చీకటి.. లేదా సినీవాలి.. లేదు ఆజ్ఞాపన..ఏదో ఒకటి తన నుంచి నా వరకూ
– రత్నకిశోర్ శంభుమహంతి
పిక్ క్రెడిట్ : వసంత్ ఘంటశాల (ఎఫ్బీ వాల్ నుంచి)