మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో ముక్క ఉండాల్సిందే. సాధారణంగా మాంసం తినాలనుకునేవారు ఏ మటన్ షాపో, చికెన్ షాపుకు వెళ్లి మాంసాన్ని తెచ్చుకుంటారు. గుడ్లు కొనుక్కోవాలన్నా.. కిరాణం లేదా చికెన్ షాపులే దిక్కు. కానీ ఓ వ్యక్తి సులభ్ కాంప్లెక్స్ లోనే మటన్, గుడ్ల షాపును నిర్వహిస్తున్నాడు. మలమూత్ర విసర్జన చేసే ప్రదేశంలో మటన్, చికెన్, గుడ్లు అమ్మడం, కొనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిధిలోని ఓ సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడి నిర్వాకం ఇది. సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తూనే.. మనీ కౌంటర్ దగ్గర మటన్, గుడ్లను అమ్మడం ప్రారంభించాడు. అది చూసిన కొందరూ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇండోర్ మున్సిపాలిటీ అధికారులు ఆ సులభ్ కాంప్లెక్స్ పై తనిఖీ నిర్వహించారు. మటన్, గుడ్లతో అడ్డంగా పట్టుబడటంతో అతడికి రూ.1000 జరిమానా విధించారు. అలాగే సులభ్ కాంప్లెక్స్ నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు రూ.20 వేల జరినామాను విధించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరూ ఆ వ్యక్తికి శిక్ష విధించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నాడని పేర్కొంటున్నారు.