కొత్త ఏడాది వస్తుందంటే చాలు.. అందరిలోనూ కొత్త ఆశలు, సరికొత్త ఉత్సాహం మొదలవుతాయి. రాబోయే కాలం తమకు అదృష్టాన్ని (Luck) తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆచారాలు పాటిస్తుంటారు. మన దగ్గర పూజలు, పిండి వంటలు చేసుకుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం భలే వింతగా సెలబ్రేట్ చేసుకుంటారు.ప్లేట్లు పగలగొట్టడం నుండి పన్నెండు ద్రాక్ష పళ్లు తినడం వరకు, వినడానికి సరదాగా ఉన్నా ఆ దేశస్తులకు ఇవి సెంటిమెంట్. 2026 కొత్త ఏడాది సందర్భంగా ఆ వింత పద్ధతులేంటో మనమూ తెలుసుకుందామా..
ప్రతి దేశానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. కొత్త సంవత్సరంలో దురదృష్టాన్ని తరిమికొట్టి, అదృష్టాన్ని ఆహ్వానించడానికి ఆయా దేశాల్లో అనుసరించే కొన్ని ఆసక్తికరమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి..
స్పెయిన్, 12 ద్రాక్ష పళ్లు: స్పెయిన్ ప్రజలు న్యూ ఇయర్ కౌంట్‌డౌన్ సమయంలో అర్ధరాత్రి గడియారం 12 సార్లు గంటలు కొట్టేలోపు 12 ద్రాక్ష పళ్లను తింటారు. ప్రతి గంటకు ఒక పండు తినాలి. ఇలా చేస్తే ఏడాదిలోని 12 నెలలు చాలా అదృష్టంగా గడుస్తాయని వారి నమ్మకం.

డెన్మార్క్, ప్లేట్లు పగలగొట్టడం: ఇది వినడానికి కొంచెం వింతగా ఉండవచ్చు, డెన్మార్క్‌లో తమ స్నేహితులు, బంధువుల ఇంటి గుమ్మం ముందు పాత ప్లేట్లను పగలగొడతారు. ఎవరి ఇంటి ముందు ఎక్కువ పగిలిన ప్లేట్లు ఉంటే వారికి అంత ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని మరియు రాబోయే ఏడాది వారికి అంత అదృష్టం కలుగుతుందని భావిస్తారు.
దక్షిణ అమెరికా, రంగుల లోదుస్తులు: కొలంబియా, మెక్సికో వంటి దేశాల్లో కొత్త ఏడాది రోజు వేసుకునే లోదుస్తుల రంగును బట్టి వారి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారు. ప్రేమ కావాలనుకునే వారు ఎరుపు రంగును, సంపద కావాలనుకునే వారు పసుపు రంగు లోదుస్తులను ధరిస్తారు.

ఫిలిప్పీన్స్, గుండ్రటి వస్తువులు: ఫిలిప్పీన్స్‌లో ‘గుండ్రని ఆకారం’ నాణేలకు (Money) సంకేతం. అందుకే న్యూ ఇయర్ రోజున వారు గుండ్రని పండ్లు తినడం, గుండ్రని డిజైన్లు ఉన్న దుస్తులు ధరించడం చేస్తారు. ఇది ఆర్థికంగా కలిసి వస్తుందని వారి నమ్మకం.
జపాన్,108 గంటల మోత: జపాన్ లోని బౌద్ధ దేవాలయాల్లో కొత్త ఏడాది రాగానే 108 సార్లు గంటలు మోగిస్తారు. మానవులలో ఉండే 108 రకాల కోరికలు, పాపాలను ప్రక్షాళన చేసి, మనసును పవిత్రం చేసుకోవడానికి ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న ఆచారాలు ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు స్థానిక నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.
