ఇకపై కేబుల్ టీవీ చానళ్లు తాము ప్రసారం చేసే డ్యాన్స్, సింగింగ్ లేదా ఇతర ఏ రియాలిటీ షోలో అయినా సరే.. పిల్లలను అసభ్యంగా చూపించరాదు.
టీవీల్లో వచ్చే రియాల్టీ షోలంటే ఒకప్పుడు ఎంచక్కా.. ఇంట్లో అందరితో కలిసి కూర్చుని సరదాగా ఎంజాయ్ చేసేట్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. టీఆర్‌పీ రేటింగులను పెంచుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న టీవీ చానళ్లు డ్యాన్స్, సింగింగ్ రియాలిటీ షోలలో అసభ్యాన్ని చొప్పిస్తున్నాయి. అది పెద్ద వారికే పరిమితం చేస్తే ఓకే. కానీ చిన్న పిల్లలతోనూ వెకిలి చేష్టలు చేయిస్తూ.. అసభ్యకర మాటలు చెప్పిస్తున్నారు. నిజానికి అలాంటి పదాలు, చర్యల గురించి చిన్నారులకు తెలియదు. కానీ వారు ఆ చర్యల మూలంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అది చిన్నారులపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది.
అయితే ఇప్పటి వరకు జరిగిందేమో గానీ.. ఇకపై కేబుల్ టీవీ చానళ్లు తాము ప్రసారం చేసే డ్యాన్స్, సింగింగ్ లేదా ఇతర ఏ రియాలిటీ షోలో అయినా సరే.. పిల్లలను అసభ్యంగా చూపించరాదు. వారితో వికృత చేష్టలు చేయించరాదు. అసభ్యరమైన, డబుల్ మీనింగ్ డైలాగ్‌లను చెప్పించరాదు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేటు టీవీ చానల్స్‌కు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
సాధారణంగా సినిమాల్లో ఉండే రొమాంటిక్ పాటలు, అందుకు తగినట్లుగా యాక్టర్లు వేసే స్టెప్పులను ప్రస్తుతం టీవీ చానళ్లలో ఆయా రియాలిటీ షోలలో చిన్న పిల్లలు వేసి చూపిస్తున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్దలు వేసే స్టెప్పులను చిన్న పిల్లలతో చేయించడమేమిటని మండి పడింది. అలా చేస్తే చిన్నారులపై అది తీవ్రంగా ప్రభావం చూపుతుందని, కనుక ఇకపై ఏ రియాలిటీ షో అయినా సరే.. పిల్లలతో అలాంటి స్టెప్పులు వేయించకూడదని, వారిని అసభ్యంగా చూపించకూడదని, మాటలు మాట్లాడించకూడదని తెలిపింది. ఈ నిబంధనలను పాటించకపోతే టీవీ చానళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది..!