మొక్కల్లో ఉన్నన్ని ఔషదగుణాలు ఇంగ్లీష్ మందుల్లో కూడా ఉండవు.. కానీ వాటిని సరిగ్గా వాడుకోవడం తెలిసినప్పుడు వాటి ప్రయోజనాలను పూర్తిగా పొందగలం. మనం ఎన్నో మొక్కలను రోజూ చూస్తాం.. కానీ వాటిపేరు, ఆ మొక్కల వల్ల ప్రయోజనాలు తెలియక లైట్ తీసుకుంటాం.. అలా మనం లైట్ తీసుకున్న మొక్కల్లో ఈ రణపాల మొక్క కూడా ఒకటి.. ఫోటో చూస్తే.. ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కదా..! ఈ మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం పిన్నటం. ఆయుర్వేదంలో ఈ రణపాల మొక్కను ఎన్నో ఏళ్లుగా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కవల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా..!
రణపాల మొక్క ప్రయోజనాలు..
రణపాల మొక్క ఆకులు మందంగా, వగరు, పులుపు రుచితో ఉంటుంది.
రణపాల మొక్కలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ మొక్కను ఉపయోగించడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.
మూత్రపిండాల్లో రాళ్లతో పాటు మూత్రసంబంధింత సమస్యలను కూడా రణపాల మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
అంటు వ్యాధులు, గాయాలు, శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో రణపాల మొక్క మనకు ఎంతో సహాయపడుతుంది.
రణపాల మొక్క ఆకులతో, కాండంతో చేసిన టీ ని తాగడం వల్ల తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయి.
మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు రణపాల మొక్క ఆకులను శుభ్రపరిచి నేరుగా నమిలి తినవచ్చు. ఇలా తినలేని వారు పావు లీటర్ నీటిలో నాలుగు రణపాల మొక్క ఆకులను వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.
జలుబు, దగ్గు, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మొక్క ఆకులను తినడం వల్ల ఆయా సమస్యల నుండి బయటపడవచ్చు.
నొప్పులకు..
ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి లేపనంగా రాసుకోవడం వల్ల నడుము నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
మొలల సమస్యతో బాధపడే వారు రణపాల మొక్క ఆకుల్లో మిరియాలు కలిపి తినడం వల్ల మొలల సమస్య నుండి బయటపడవచ్చు.
రణపాల మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులో పండ్లు, అల్సర్లు వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ రసాన్ని తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ మొక్క ఆకులను పరగడుపున నమిలి తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
రణపాల మొక్క ఆకుల రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల చొప్పున రెండు పూటలా తీసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది.
ఈ మొక్క ఆకులను వేడి చేసి గాయలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగడంతో పాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి.
గడ్డలకు..
ఈ మొక్క ఆకులను పేస్ట్‌గా చేసి కొవ్వు గడ్డలు, వేడి కురులపై, శరీరంలో వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఆయా సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.
ఈ మొక్క ఆకుల రసాన్ని రెండు లేదా మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవిపోటు తగ్గుతుంది.
అలాగే 40 నుండి 50 ఎమ్ ఎల్ మోతాదులో ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకుని అందులో తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే యోని సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రణపాల మొక్కల ఆకుల రసాన్ని కళ్ల చుట్టూ లేపనంగా రాసుకోవడం వల్ల కళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మొక్క కనిపిస్తే కచ్చితంగా తెచ్చుకోండి.. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే తెలిసి తెలియక ఒకటి అనుకోని ఇంకోటి వాడే ప్రమాదం ఉంది. కన్ఫామ్ చేసుకున్నాకే మొక్కను వాడటం మొదలుపెట్టండి. కన్ఫామ్ ఎలా చేసుకోవాలంటే.. ఆయుర్వేద నిపుణులు లేదా సర్జికల్ షాపుల్లో అడిగినా చెప్తారు.