అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కనిపించే అరుదైన జాతికి చెందిన ఓ పుష్పం ప్రస్తుతం మేఘాలయలో దర్శనమిచ్చింది. సప్రియా హిమాలయానా జాతికి చెందిన పుష్పంగా దాన్ని గుర్తించారు. ఈ పుష్పం అంతరించిపోతున్న పుష్ప జాతుల జాబితాలో ఉందని పర్యావరణ వేత్తలు తెలిపారు.
మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఉన్న నొక్‌రెక్ బయోస్పియర్ అనే ప్రాంతంలో భుటో మరక్ అనే వ్యక్తి ట్రెక్కింగ్‌కు వెళ్లగా ఆ పుష్పం కంటబడింది. దీంతో ఆ పుష్పాన్ని అతను ఫొటోలు తీశాడు. సంబంధిత అధికారులకు అతను ఆ విషయం చెప్పాడు. అయితే ఆ ప్రాంతంలో సరిగ్గా ఎక్కడ ఈ పుష్పం ఉందనే విషయాన్ని అతను వెల్లడించలేదు. ఆ విషయం చెబితే అందరూ ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని, దాంతో ఆ పుష్పం జాతి మనుగడకు సమస్య వస్తుందని ఆ విషయాన్ని వెల్లడించలేదు.
అయితే ఆ పుష్పం అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌లలోనూ పలు చోట్ల గతంలో కనిపించింది. ఆ పుష్పం మొగ్గ 40 నుంచి 60 శాతం మాత్రమే పువ్వుగా మారుతుంది. కేవలం 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే ఆ పుష్పం విరబూసి ఉంటుంది. ఇక ఇదే జాతికి చెందిన మరో మూడు పుష్పాలు కూడా ఉన్నాయి. వాటిని గ్రిఫిత్, పొయిలానెయి, రామ్ అని పిలుస్తారు. చలికాలంలో ఈ పూలు ఎక్కువగా పూస్తాయి. ఈ పువ్వులు చూసేందుకు చాలా మనోహరంగా దర్శనమిస్తాయి. వీటిని సంరక్షించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.