వాహ్‌.. వ‌జ్రాల‌ను ల్యాబ్‌లో త‌యారు చేసిన సైంటిస్టులు..!

భూమిలో ఎన్నో వంద‌ల కోట్ల సంవ‌త్స‌రాల పాటు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు, పీడ‌నం ఏర్ప‌డితేగానీ వ‌జ్రాలు త‌యారు కావు. అవి ల‌భించినా ముడి ప‌దార్థం రూపంలో ఉంటాయి. వాటిని మ‌ళ్లీ స‌రైన ఆకృతిలోకి తీసుకురావాల‌న్నా, అస‌లైన వ‌జ్రంగా మార్చాల‌న్నా అత్య‌ధిక శ్ర‌మ ప‌డాల్సి ఉంటుంది. కానీ సైంటిస్టులు ఈ స‌మ‌స్య‌లు ఏవీ లేకుండా కేవ‌లం గది ఉష్ణోగ్ర‌త వద్దే నిమిషాల్లోనే వ‌జ్రాల‌ను త‌యారు చేశారు. అవును.. ఏంటీ.. న‌మ్మ‌లేరా.. అయినా ఇది నిజ‌మే.

ఆస్ట్రేలియ‌న్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ (ఏఎన్‌యూ), మెల్‌బోర్న్‌లోని ఆర్ఎంఐటీ యూనివ‌ర్సిటీల‌కు చెందిన ప‌రిశోధ‌కులు సంయుక్త‌గా క‌లిసి వ‌జ్రాల‌ను ల్యాబ్‌లో త‌యారు చేశారు. సాధార‌ణ వ‌జ్రంతోపాటు లాన్స్‌డెలైట్ అనే రెండు ర‌కాల వ‌జ్రాల‌ను వారు త‌యారు చేశారు. అయితే వ‌జ్రాల‌కు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌, పీడ‌నం అవ‌స‌రం అవుతాయి. కానీ వారు గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద త‌యారు చేయ‌డం విశేషం.

ఇక పీడ‌నం కోసం వారు ప్ర‌త్యేక యంత్రాల‌ను ఉప‌యోగించారు. వాటి ద్వారా 640 ఆఫ్రికా ఏనుగులు కాళ్ల‌తో తొక్కితే ఎంత ప్రెష‌ర్ వ‌స్తుందో అంత పీడ‌నాన్ని సృష్టించారు. అనంత‌రం దాంతో వ‌జ్రాల‌ను త‌యారు చేశారు. ఇక వాటిని క్షుణ్ణంగా ప‌రిశీలించారు. అవి సాధార‌ణంగా గ‌నుల్లో మ‌న‌కు స‌హ‌జంగా ల‌భించే వ‌జ్రాల‌ను పోలి ఉండ‌డం విశేషం. అయితే సైంటిస్టులు గ‌తంలోనూ ఈ ప్ర‌యోగాలు చేప‌ట్టారు. కానీ అప్ప‌ట్లో వ‌జ్రాల త‌యారీకి అధిక ఉష్ణోగ్ర‌త‌లు అవ‌స‌రం అయ్యాయి. కానీ ఇప్పుడు కేవ‌లం గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్దే వాటిని త‌యారు చేయ‌డం విశేషం. అంటే భ‌విష్య‌త్తులో మ‌నం కృత్రిమ వ‌జ్రాల‌ను కూడా కొనుగోలు చేసి ఆభ‌ర‌ణాల్లో ఉపయోగించ‌వచ్చ‌న్న‌మాట‌. మరి అవి ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తాయి, వాటి ధ‌ర ఎంత ఉంటుంది ? అన్న వివ‌రాల‌ను మాత్రం ఆ సైంటిస్టులు వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే అవి మార్కెట్‌లోకి వస్తే బాగుంటుంది క‌దా..!