వేసవి వచ్చిందంటే చాలు ఏసీల వాడకం పెరిగిపోతుంది. వేసవిలో చల్లగా ఉండేందుకు చాలా మంది ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఏసీల వల్ల చల్లగా ఉండవచ్చు. కానీ వాటిని అతిగా వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. మరోవైపు విద్యుత్ కూడా ఎంతగానో వినియోగం అవుతుంది. వేసవిలో ఏసీలను వాడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం విద్యుత్ వాటికే ఖర్చవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇకపై ఏసీలను వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాటి స్థానంలో సూపర్-వైట్ పెయింట్ అందుబాటులోకి రానుంది.
అమెరికాలోని ఇండియానా స్టేట్‌లో ఉన్న పర్‌డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు నూతన తరహా అల్ట్రా-వైట్ పెయింట్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని అనేక రకాలుగా వారు టెస్టు చేశారు. ఈ పెయింట్‌ను ఇంటి పైకప్పు మీద వేస్తే సూర్య కాంతిని 98.1 శాతం వరకు అడ్డుకుంటుంది. దీంతో ఇంట్లో చల్లగా ఉంటుంది. ఈ పెయింట్‌ను 1000 చదరపు అడుగుల పైకప్పు మీద వేస్తే ఆ ఇంట్లో మధ్యాహ్నం అయితే 10 డిగ్రీలు, రాత్రి అయితే 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీన్ని సైంటిస్టులు పలు విధాలుగా టెస్టు చేసి తెలిపారు. అందువల్ల ఈ పెయింట్‌ను వాడితే ఇక ఏసీల అవసరం ఉండదు.
అయితే ఈ పెయింట్ ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేది వారు వెల్లడించలేదు. కానీ మరిన్ని పరీక్షల అనంతరం వారు దీన్ని వాణిజ్య పరంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మనకు ఇప్పటికే పలు రకాల వైట్ పెయింట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వల్ల కొంత వరకు మాత్రమే ఇంట్లో చల్లగా ఉంటుంది. అవి సూర్య కాంతిని పూర్తిగా అడ్డుకోలేవు. కానీ ఈ అల్ట్రా వైట్ సూపర్ పెయింట్ మాత్రం సూర్య కిరణాలను 98.1 శాతం వరకు అడ్డుకుంటుండడం హర్షణీయమని, దీంతో వేసవిలో ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని సైంటిస్టులు అంటున్నారు.