ఎలిజబెత్‌-2 మహారాణి అస్తమయం.. ఇప్పుడు ఆ కోహినూర్‌ వజ్రం ఎవరికి దక్కనుంది?

-

బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు పాలించిన మహారాణి ఎలిజబెత్‌-2(96) గురువారం కన్నుమూశారు. నిన్న మధ్యాహ్నం ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని బర్మింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఈ సమయంలో కోహినూర్ వజ్రం గురించి ఓ వార్త వినిపిస్తోంది. ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి వెళ్తుందన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.

రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ నూతన రాజుగా, 14 కామన్వెల్త్‌ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. చార్లెస్ సతీమణి కెమిల్లా(డచెస్‌ ఆఫ్ కార్న్‌వాల్‌)కు రాణి హోదా దక్కుతుంది. అప్పుడు కోహినూర్‌తో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. ఎలిజబెత్‌-2.. 70 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది బ్రిటన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి రాణి ఇచ్చిన సందేశంలో తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి కావాలని ఆకాంక్షించారు. తదుపరి రాణికే ఈ కిరీటధారణ జరగనుంది.

1937లో కింగ్ జార్జ్‌-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్‌ ఉంది. ఇది ఇప్పుడు ఎలిజబెత్‌-2 నుంచి కెమిల్లాకు చేరుతుంది. ఈ కోహినూర్.. 105.6 క్యారెట్ల వజ్రం. దీనిని 14వ శతాబ్దంలో భారత్‌లో గుర్తించారు. తర్వాత ఎన్నో చేతులు మారింది. 1849లో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత విక్టోరియా రాణి చెంతకు చేరింది. అప్పటినుంచి ఆ రాజ కుటుంబం కిరీటంలో వెలుగులీనుతోంది. అయితే భారత్‌తో సహా దాదాపు నాలుగు దేశాల్లో దీనిపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది.

రాచరికంలో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. అయితే కెమిల్లా విషయంలో కొంత అనిశ్చితి ఉంది. ప్రిన్స్‌ చార్లెస్‌కు ఆమె రెండో భార్య కావడం, కెమిల్లాకు కూడా ఇది రెండో వివాహం కావడం ఇందుకు కారణం. చార్లెస్‌ తొలుత ప్రిన్స్‌ డయానాను వివాహమాడారు. 1996లో వారు విడాకులు తీసుకున్నాక ఏడాదికే డయానా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆ తర్వాత 2005లో చార్లెస్‌, కెమిల్లాల వివాహమైంది. అందగత్తెగా విశేషాదరణ పొందిన డయానా స్థానంలోకి కెమిల్లా రావడంతో ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు గత సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కెమిల్లాకు రాణి హోదాపై అనుమానాలుండేవి. వీటన్నింటినీ పక్కనబెట్టి తన కోడలు కెమిల్లాకు రాణి హోదా రావాలని ఎలిజబెత్‌-2 అభిలషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version