బంధం అనే దారాన్ని కత్తిరిస్తే ఎత్తుకు ఎగరవచ్చు అనుకునే వారికోసం అద్భుత కథ..

-

ఒక ఊరిలో ఆరేళ్ల పిల్లాడు వాళ్ళ నాన్నతో కలిసి పార్కుకి వెళ్ళాడు. అక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆకాశమంతా రంగు రంగుల గాలిపటాలతో నిండి ఉంది. అది చూసిన పిల్లాడు, నాన్నా.. నాకు గాలి పటం కొనివ్వు అని అడిగాడు. దానికి నాన్నా, పక్కనే ఉన్న దుకాణంలో గాలిపటం, దారం కొని ఇచ్చాడు. పిల్లాడు గాలిపటాన్ని దారానికి కట్టి గాల్లో ఎగరవేసాడు. గాలి పటం గాల్లో చాలా ఎత్తుకు ఎగిరింది. ఇంకా ఎత్తుకు పోతూనే ఉంది. అప్పుడు, ఆ పిల్లాడు ఇలా అన్నాడు.

నాన్నా.. ఈ దారం కత్తిరించు.. దీనివల్ల ఇది ఇంకా పైకి వెళ్ళడం లేదు అనగానే దారాన్ని కత్తిరించాడు. అప్పుడు, ఆ గాలిపటం ఇంకా పైకి వెళ్ళింది. అది చూసిన చిన్నపిల్లాడు సంతోషించాడు. అంతలోనే ఆ గాలిపటం కిందకు దిగడం ప్రారంభించింది. అలా దిగుతూ దిగుతూ, ఒక బంగ్లామీద పడింది. గాలిపటం కిందకి రావడంతో చిన్నపిల్లాడు నిరాశ చెంది, దారం కత్తిరిస్తే ఇంకా పైకి వెళ్తుందనుకుంటే ఇలా అయ్యిందేంటి నాన్నా అన్నాడు. అపుడు, నాన్న ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

దారం వల్లనే గాలిపటం ఎగురుతుంది. గాలి లేనపుడు ఆ దారం వల్లనే గాలిపటం గాల్లో ఆగగలుగుతుంది. ఎప్పుడైతే దారం తెంచేసావో అప్పుడు అది కిందకు దిగిపోతుంది. అందుకే గాలిపటానికి దారం చాలా ముఖ్యం అన్నాడు. అవును, జీవితంలో ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు. ఈ బంధాలు, స్నేహితులు లేకుండా ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేవాడిని కదా అని. కానీ అవి ఉండడం వల్ల నువ్వు కిందపడకుండా ధైర్యాన్ని ఇస్తాయి. అవెప్పుడూ నిన్ను పైకి లేపాలనే చూస్తాయి. కనిపించని దారం మాదిరిగా బంధాలు కూడా నీ బాగు గురించే ఆలోచిస్తాయి.

అందుకే బంధాలకు విలువ ఇవ్వండి. అవి లేనప్పుడే వాటి విలువ అర్థం అవుతుంది. ఆ టైమ్ లో ఆ పిల్లాడు బాధపడినట్టు బాధపడడం తప్ప చేసేదేమీ ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version