భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన దట్టమైన వర్షారణ్యాలలో ఒకటైన అమెజాన్ అడవి దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. ఈ అడవులలో విస్తారమైన నదులు, అరుదైన వృక్ష జంతు జాతులు ఉన్నాయి. అందుకే దీనిని “భూమి యొక్క ఊపిరితిత్తులు” అని పిలుస్తారు. ఈ అపారమైన జీవవైవిధ్యంతో పాటు, అమెజాన్ అడవులలో నాగరిక ప్రపంచానికి పూర్తిగా దూరంగా జీవిస్తున్న కొన్ని గిరిజన తెగలు ఇప్పటికీ ఉన్నాయి. వారి జీవితం, సంస్కృతి గురించి ఇప్పటికీ చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే వారు మనకు ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయారు. మరి మనం ఆ మర్మమైన తెగల గురించి, అలాగే అమెజాన్ అడవుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
అమెజాన్ అడవుల్లో అంతుచిక్కని తెగలు: అమెజాన్ అడవుల్లోని కొన్ని గిరిజన తెగలు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడవు. ఈ తెగలు వేల సంవత్సరాలుగా తమ సంస్కృతి, జీవన విధానాలను కాపాడుకుంటున్నాయి. వారు అడవిలోని జంతువులను వేటాడి, అడవిలోని పండ్లను సేకరించి జీవిస్తారు. ఈ తెగలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో, బయటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు వ్యాధుల బారిన పడటం, భూమిని కోల్పోవడం వంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. అందుకే వారు ఆధునిక నాగరికతను దూరంగా ఉంచుతూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు.

వారిని ఎవరైనా గుర్తించారా: ఈ తెగలను గుర్తించడం చాలా కష్టం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొన్నిసార్లు విమాన సర్వేలు నిర్వహించి అడవుల్లో వారి నివాసాలను, వేట స్థలాలను గుర్తించారు. ఈ సర్వేలలో కనిపించే గుడిసెలు, పంట పొలాలను బట్టి ఈ తెగలు ఎంత సంఖ్యలో ఉన్నాయో అంచనా వేస్తారు. కానీ, వారి పేర్లు భాష, సంస్కృతి గురించి ఇప్పటికీ చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. బ్రెజిల్‌లోని ఫునాయ్ (FUNAI) వంటి సంస్థలు ఈ తెగలను రక్షించడానికి కృషి చేస్తున్నాయి. బయటి వ్యక్తులు వారి ప్రాంతంలోకి వెళ్లకుండా రక్షణ కల్పిస్తున్నాయి.
అమెజాన్‌లోని ఈ తెగలు ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రకృతితో మమేకమై జీవించడం, తమ సంస్కృతిని కాపాడుకోవడం ఎలాగో వారు చూపిస్తున్నారు. వారి జీవితం మనకు ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. అదే సమయంలో ప్రకృతితో ఎలా మెలగాలో నేర్పుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం వివిధ పరిశోధనలు, నివేదికల ఆధారంగా రూపొందించబడింది. అమెజాన్ అడవుల్లోని మర్మమైన తెగల గురించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులో లేదు.