లోకంలో మొత్తం ఐదే రకాల జంటలు.. మీ జంట ఏ రకం..?

-

భార్యభర్తలు అంటే.. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉండాలి.. అప్పుడే వారు కలకాలం కలహాలు లేకుండా కాపురం చేసుకోగలుగుతారు. కానీ ఈరోజుల్లో అలా ఉండటం లేదు. నువ్వా నేను అన్నట్లు గొడవలకు కాలు దువ్వుతున్నారు. సరే ఈ విషయం పక్కనపెడితే.. మీరు పంచదంపతుల గురించి విన్నారా..? ఈ లోకంలో కోట్లాది జంటలున్నా అంతా ఈ 5 రకాలుగానే ఉంటారట. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ.. ఇంతకీ ఎవరా 5జంటలు..మీ జంట ఇందులో ఏ రకానికి చెందుతుందో తెలుసుకోండి.

లక్ష్మీనారాయణులు

పంచదంపతుల్లో మొదటి జంట శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. శ్రీహరి వక్షస్థలం మీద నివాసం ఉంటుంది లక్ష్మీదేవి. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి…అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంటను లక్ష్మీనారాయణులతో పోల్చుతారు.

బ్రహ్మ-సరస్వతి

చతుర్ముఖుడైన బ్రహ్మ నాలుకమీద ఉంటుంది. నాలుక మాటలకు సంకేతం. అంటే ఇద్దరి మాటా ఒక్కటే అని అర్థం. తనమాటే నామాట అంటారు కదా..దాని అర్థం ఇదే. ఇద్దరూ కలసి ఆలోచించినా విడివిడిగా ఆలోచించినా ఒకే మాటని వ్యక్తపరచడం. ఇలా ఉండే జంటల్ని సరస్వతి-బ్రహ్మ జంట అంటారు.

ఛాయా సూర్యులు

సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతాడు. అంత తీక్షణతను కూడా తట్టుకుంటూ భర్తతో సాగుతుంది ఛాయాదేవి. ఎందుకంటే తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు..భర్త పరిస్థితికి అనుగుణంగా నీడలా సాగుతూ సర్దుకుపోతుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా ,పట్టుదలతో ఉంటాడో…ఆ ఇంట భార్యమాత్రం నెమ్మదిగా, శాంతంగా, అణకువగా ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

గౌరీ శంకరులు

అర్థనారీశ్వర తత్వం ద్వారా భార్య తనలో సగం అని చాటిచెప్పాడు ఆ పరమేశ్వరుడు. తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు. శరీరాలు రెండు కలసినా ఒకే రూపంలో కనిపిస్తారు. తల ఆలోచనలకు, కాళ్లు కార్యనిర్వహణకు సంకేతం. అందుకే భార్యను గొప్పగా చూసుకునే భర్తకు ఆలోచన, ఆచరణ రెండింటిలోనూ భార్య నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇలా కష్టసుఖాల్లో తోడునీడగా ఉండేవారిని గౌరీశంకరులతో పోల్చుతారు.

రోహిణీ చంద్రులు

పంచదంపతుల్లో ఐదో జంట రోహిణి-చంద్రుడు. రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే నానుడి ఉంది. ఉంది అంటే వేడి అంతలా ఉంటుంది. చంద్రుడు మాత్రం ఆహ్లాదాన్ని ఆకర్షణను కలుగజేసేవాడు. ఏ జంటలో భర్త సైలెంట్‌గా ఉండి ఆకర్షణీయుడిగా ఉంటాడో ఆ ఇంట భార్య మాత్రం కఠినంగా, కోపంగా, అధిక పట్టుదలతో ఉంటే ఆ జంటను రోహిణి చంద్రులతో పోలుస్తారు

Read more RELATED
Recommended to you

Exit mobile version