ఈ జనరేషన్ వారికి పిచ్చుకలను చార్ట్స్ మీదే చూసే పరిస్థితి ఉంది. చాలామంది పిచ్చుకలను రియల్ గా చూడలేదు. ఊళ్లలో కూడా ఇంతకు ముందు ఉన్నట్లు లేవు. కొన్ని సంవత్సరాలకు ఇవి అంతరించిపోతాయోమో అనిపిస్తుంది కదా.. సెల్ టవర్స్ ఎక్కువ అయిపోవడంతో.. పల్లెల్లో సైతం పిచ్చుకలు కానరాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితి పక్షిప్రేమికుడైన కరీంనగర్ జిల్లా వాసికి బాగా బాధ కలిగించింది. వాటికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. మూగప్రాణుల్ని కాపాడాలనే తన తపన నుంచి వచ్చింది ఓ వినూత్నమైన ఆలోచన..అదేంటో మీరు చూడండి.
కరీంనగర్ జిల్లా కిసాన్‌నగర్‌కు చెందిన అనంతుల రమేశ్ పిచ్చుకలకు నిలువ నీడ లేకుండాపోవడంతో తన ఇంటినే వాటికి ఆవాసంగా మార్చాడు. పిచ్చుకలు వాయు కాలుష్యం బారిన పడకుండా ఖాళీ నూనె డబ్బాలతో పక్షులు నివసించేందుకు అందమైన గూళ్లను తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేశాడు. ఖాళీ నూనె డబ్బా తీసుకొని నాలుగు వైపులా కట్ చేసి ఆ డబ్బా నాలుగు కొసలను కొంచెం వంచి అందులో పిచ్చుకలు తినడానికి కావాల్సిన గింజలు వేశాడు.
మధ్యలో నీరు పోసే వెసులుబాటు కూడా ఉంచాడు. అంతే కాదు వాటికి ఇష్టమైన ఆహారం గడ్డి, తినేందుకు గింజల ఏర్పాటు చేయడంతో పాటు అనుకూలంగా ఉండే వాతావరణం కల్పించాడు. తన ఇంటి వద్దే పిచ్చుకల కోసం అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసులను ఉంచాడు. పిచ్చుకలు గూళ్లు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచాడు. పక్షలకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడం వల్ల అక్కడకు వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరగుతూ వస్తుంది.
అంతరించి పోతున్న పిచ్చుకలను కాపాడేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్లుగా రమేష్ తెలిపారు. మొదట్లో ఒకటి రెండు పక్షలు మాత్రమే వచ్చేవని..ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందని.. ఉదయం పిచ్చుకల గుంపు చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంటున్నాడు మన రమేష్.
నాలుగు పక్షులూ నాలుగు వైపుల నుంచీ ఒకే సారి ఆకలి తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని రమేష్ తెలిపారు. కుటుంబసహకారంతోనే ఇదంతా చేయగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ పెరట్లోకాని.. ఇంటి ముందు కాని ఇలా పిచ్చుకల కోసం ధాన్యం గింజలు, నీటిని సమకూరిస్తే పక్షి జాతిని కాపాడుకొనే అవకాశం ఉంటుందని రమేష్ అంటున్నారు.