అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ట్రంప్‌పై భారీ మెజారిటీతో గెలిచిన ఆయన ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అయితే మన దేశంలో ప్రధాని, సీఎంలు, ఇతర ప్రజా ప్రతినిధులకు వచ్చినట్లే అమెరికాలోనూ ప్రజా ప్రతినిధులకు జీతాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షులు కూడా వేతనాలు పొందుతారు.
ఇక అధ్యక్ష పదవిలో జో బైడెన్‌కు ఏడాదికి 4 లక్షల డాలర్ల వేతనం అందుతుంది. దీంతోపాటు ఆయనకు పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. ఎలాంటి పన్ను లేకుండా ప్రయాణ ఖర్చులకు ఏడాదికి లక్ష డాలర్లు ఇస్తారు. మరో 50వేల డాలర్లను ఇతర ఖర్చులకు ఇస్తారు. విందులు, వినోదాల ఖర్చులకు ఏడాదికి 19వేల డాలర్లు ఇస్తారు.
అధ్యక్ష పదవిలో ఉన్నన్ని రోజులు వైట్ హౌజ్‌లో ఉండాలి. అందులో 132 గదులు ఉంటాయి. 24 గంటలూ అందుబాటులో ఉండే వంటగది, 42 మంది కెపాసిటీ కలిగిన హోం థియేటర్ వంటి సదుపాయాలు వైట్ హౌజ్‌లో ఉంటాయి. అధ్యక్షుడు, ఆయన కుటుంబంతోపాటు మొత్తం 100 మంది ఇతర సిబ్బంది వైట్ హౌజ్‌లో ఉంటారు. వైట్ హౌజ్ కోసం అమెరికా ప్రభుత్వం ఏడాదికి 40 లక్షల డాలర్లను ఖర్చు చేస్తుంది. ఇవే కాకుండా క్యాంప్ డేవిడ్, బ్లెయిర్ హౌజ్ అనే మరో రెండు గెస్ట్ హౌజ్‌లు కూడా అమెరికా అధ్యక్షుడికి అందుబాటులో ఉంటాయి.
అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఏడాదికి 2 లక్షల డాలర్ల పెన్షన్ ఇస్తారు. మరో 2 లక్షల డాలర్ల భత్యాలు ఉంటాయి. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలికి నిర్దిష్టమైన జీతం అంటూ ఉండదు. కానీ ప్రస్తుతం మాత్రం ఏడాదికి 2.35 లక్షల డాలర్లను వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు మరో 10వేల డాలర్ల వరకు భత్యాలను అందిస్తారు. ఇక అమెరికా ఉపాధ్యక్షులు నంబర్ వన్ అబ్జర్వేటరీ సర్కిల్ భవంతిలో నివాసం ఉంటారు. వైట్ హౌజ్‌కు 3 మైళ్ల దూరంలో ఈ బిల్డింగ్ ఉంటుంది. కానీ అధ్యక్షుడి అంగీకారం ఉంటే వైట్ హౌజ్‌లోని సదుపాయాలను కూడా ఉపాధ్యక్షులు ఉపయోగించుకోవచ్చు.