అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ప్రతీ ఏడాది నవంబరు 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కానీ ప్రపంచంలో చాలా మందికి అసలిలాంటి రోజు ఉందనే విషయం కూడా తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాముఖ్యత పురుషుల దినోత్సవానికి కనిపించట్లేదు. అసలు పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు. నవంబరు 19వ తేదీనే ఎందుకు? ఈ రోజున పురుషులు తెలుసుకోవాల్సిన విషయాలేంటి?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు. 1969నుండి పురుషుల దినోత్సవం గురించి డిమాండ్ చేస్తున్నారు. చివరికి డాక్టర్ జీరోమ్ టీలక్సింగ్ చేత 1999నుండి పురుషుల దినోత్సవం మొదలైంది. జీరోమ్ టీలక్సింగ్ తన తండ్రి పుట్టినరోజైన నవంబరు 19వ తేదీని పురుషుల దినోత్సవంగా మొదలెట్టాడు.

ప్రపంచ పురుషుల సమస్యలను పరిష్కరించడానికి, మానసిక, శారీరక ఒత్తిడి వంటి వాటిపై చర్చించి, ఆత్మహత్యలు చేసుకోనివ్వకుండా వారిలో ధైర్యాన్ని నింపే ఉద్దేశ్యంతో ప్రపంచ పురుషుల దినోత్సవం ప్రారంభమైంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక 45సంవత్సరాల లోపు గల వయస్సులో చాలామంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సంవత్సరం పురుషుల దినోత్సవం థీమ్ ఏంటంటే, సానుకూల పురుష మార్గదర్శులు.. దీని ప్రకారం పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి అవగాహన. దీని ప్రకారం వారు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. పురుషులు ఏడవకూడదు అనే భావనని విడిచిపెట్టి, వారు అనుభవిస్తున్న మానసిక వేదనని ప్రశాంతంగా వెలిబుచ్చేందుకు స్పేస్ ఇవ్వాలి. వారి మనుసులోని భావాలని పురుషులు అన్న కారణంగా వారిలోనే అణచివేసుకోకుండా చెప్పుకునేందుకు కావాల్సిన సాయం అందించాలి.

పురుషులకి ఏం ప్రాబ్లమ్ ఉంటుంది అనుకునేవారు, వారి మనసులోని సున్నితమైన భావాలని పురుషుడు అన్న కారణంగా ఎవరికి చెప్పుకోనివ్వకుండా చేయడమనేది ఎంతవరకు కరెక్ట్.. అందుకే పురుషుల దినోత్సవం రోజున ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మంచిదే.