ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. మే చివరి వారం కావడంతో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అనేక చోట్ల 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే మన దగ్గర ఎండలు ఇలా ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం.. కానీ ఇంతకన్నా ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే…
1. డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా, అమెరికా
ఇక్కడ 1913లో 56.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సహజంగానే వేసవిలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
2. అజీజియా, లిబియా
ఈ ప్రాంతంలో 1922లో గరిష్టంగా 58 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ 2012లో పలువురు పరిశోధకులు ఆ విషయం వట్టిదే అని తేల్చారు. కానీ ఇక్కడ సాధారణంగా 48 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
3. డాల్లొల్, ఇథియోపియా
ఈ ప్రాంతంలో 1960 నుంచి 1966 మధ్య నిరంతరాయంగా రోజూ 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాల్లో ఇదొకటిగా నిలిచింది.
4. వాడి హాల్ఫా, సూడాన్
ఇక్కడ వేసవిలో సరాసరిగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 1967లో ఇక్కడ గరిష్టంగా 53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
5. దష్త్-ఇ లూట్, ఇరాన్
ఇది ఎడారి ప్రాంతం. ఇక్కడ 2003 నుంచి 2009 మధ్య కాలంలో గరిష్టంగా 70.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇక్కడ మనుషులెవరూ నివాసం ఉండరు.
6. తిరాత్ జ్వీ, ఇజ్రాయెల్
ఆసియాలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతంగా ఈ ప్రదేశం రికార్డులకెక్కింది. ఇక్కడ 1942లో 54 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సంవత్సరం పొడవునా యావరేజ్‌గా 37 డిగ్రీల ఉష్ణోగత నమోదవుతుంది.
7. తింబుక్తు, మాలి
సహారా ఎడారి దక్షిణం అంచు వైపునకు ఈ నగరం ఉంది. ఇక్కడ జనవరిలోనే 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గరిష్టంగా ఇక్కడ 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
8. కెబిలి, టునిషియా
ఇది ఎడారి ప్రాంతం. ఇక్కడ అత్యంత నాణ్యమైన, రుచికరమైన ఖర్జూరాలు పండుతాయి. ఇక్కడ యావరేజ్‌గా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గరిష్టంగా 55 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి.
9. ఘడామెస్, లిబియా
ఇది ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ 7వేల మంది జనాభా నివసిస్తారు. అయితే ఎండ నుంచి తట్టుకునేందుకు వీరు బురదతో తయారు చేసిన గుడిసెలు నిర్మించుకుని వాటిల్లో నివాసం ఉంటారు. ఈ నిర్మాణాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కూడా లభించింది. ఇక్కడ యావరేజ్‌గా 40 డిగ్రీలు, గరిష్టంగా 55 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
10. బందర్-ఇ మషాహర్, ఇరాన్
ఈ ప్రాంతంలో సహజంగానే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ గరిష్టంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.