కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ బయట తిరిగేటప్పుడు కచ్చితంగా మాస్కులను ధరించాలని అందరూ చెబుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని అనేక రాష్ట్రాలు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే కొందరు మాత్రం మాస్కులను ధరించినా వైరస్ వ్యాప్తిని ఆపలేమని అంటుంటే.. కొందరు.. కరోనాకు మాస్కులను ధరించాల్సిన పనిలేదని అంటున్నారు. అయితే ఎవరి వాదనలో నిజం ఎంత ఉంది..? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాస్కులను ధరించడంపై ఏం చెబుతోంది..? ఎవరు ఎలాంటి మాస్కులను ధరించాలి..? వంటి సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులను ధరించడంపై WHO ఏం చెబుతోంది..?
కరోనా మాస్కులను ధరించడంపై WHO ఏప్రిల్ 6వ తేదీన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులను ధరించడం కరెక్టే.. కానీ వాటిని ఒక్కసారి ధరించాక.. తిరిగి వాటిని మళ్లీ ధరించవచ్చో లేదో తెలుసుకోవాలి. తిరిగి మాస్కులను ధరించదలిస్తే వాటిని శుభ్రం చేసుకోవాలి. అదే యూజ్ అండ్ త్రో మాస్కులు అయితే ఒక్కసారి ధరించాక వాటిని పడేయాలి. అంతేకానీ.. ఈ విషయాలు తెలియకుండా మాస్కులను ఇష్టం వచ్చినట్లుగా ధరించకూడదు.
2. మెడికల్ మాస్కులను ఎవరు ధరించాలి..?
సర్జికల్ మాస్కులు, ఎన్95 మాస్కులను వైద్య సిబ్బంది ధరించాలి. కొందరు వీటిని అవగాహన లేకుండా ధరిస్తున్నారు. ప్రజలు మెడికల్ మాస్కులను ధరించకూడదు. సాధారణ మాస్కులను ధరించాలి. అవగాహన లేక మెడికల్ మాస్కులను కొందరు ధరిస్తుండడం వల్ల కోవిడ్ 19 వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది.
3. హెం మేడ్ మాస్కులను ధరించడం క్షేమమేనా..?
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు క్లాత్‌తో తయారు చేయబడిన హోం మేడ్ మాస్కులను ధరించవచ్చని చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారు. మాస్కులు దొరకడం లేదని దిగులు చెందకుండా.. ఇంట్లోనే సొంతంగా మాస్కులను తయారు చేసుకుని ధరించాలని అంటున్నారు.
4. కరోనా నుంచి మాస్కులు రక్షిస్తాయా..?
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తప్పనిసరై బయటకు వస్తే.. మాస్కులను ధరించాలని అంటున్నారు. మరి మాస్కులు సురక్షితమేనా..? అవి కరోనా రాకుండా రక్షిస్తాయా..? అంటే.. అవును.. మాస్కులు కరోనా రాకుండా చాలా వరకు మనకు రక్షణ ఇస్తాయి. అంత మాత్రాన మనకు కరోనా రాదని అనుకోకూడదు. సోషల్ డిస్టాన్స్ తప్పనిసరిగా పాటించాలి.
5. ఒక మాస్కును ఎంత కాలం వాడవచ్చు..?
ఒక మాస్కును సాధారణంగా 4 నుంచి 5 గంటల వరకు ధరించవచ్చు. అయితే పలు రకాల మాస్కులను వాష్ చేసి మళ్లీ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇంట్లోనే క్లాత్‌తో తయారు చేసే మాస్కులను ధరించి తీసేయగానే బాగా శుభ్రం చేయాలి. మళ్లీ బయటకు వెళ్లినప్పుడు వాటిని ధరించవచ్చు. ఇక ఇతర మాస్కులలో యూజ్ అండ్ త్రోవి ఉంటాయి. వాటిని ఒక్కసారి ధరించి పడేయాలి. కొన్ని మాస్కులు శుభ్రం చేసి మళ్లీ వాడేందుకు అనువుగా ఉంటాయి. వాటిని బాగా వాష్ చేయాలి. అయితే మాస్క్ ధరించాక దాన్ని వీలైనంత వరకు టచ్ చేయకూడదు. మాస్క్‌ను తీశాక దాన్ని టచ్ చేయకుండా శుభ్రం చేయాలి. ఆ తరువాతే దాన్ని మళ్లీ ఉపయోగించాలి.