ప్రపంచంలోనే కాస్ట్లీ మాస్కు..!

-

కరోనా వైరస్ రాకముందు ఓసీడీ ఉన్నవాళ్లే మాస్కులు శానిటైజర్లు వాడేవాళ్లు.. 100 మందిలో ఒకరిద్దరు పెట్టుకునే వాళ్లు. ఎప్పుడైతే ఈ మహమ్మారి వచ్చిందో మాస్కులు ధరించకుండా ప్రజలు బయటకు రావటం లేదు. ఈ అవసరం ఇప్పుడు కాస్త ఫ్యాషన్ గా మారిపోయింది. మ్యాచింగ్ మాస్కులు పై యువత మొగ్గు చూపుతున్నారు. మాస్కులకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకూ ఖరీదైన మాస్కు అంటే ఎన్95. కానీ తాజాగా బంగారం, వజ్రాలతో ఓ సంస్థ మాస్కులను తయారు చేసింది.

బంగారం, వజ్రాలతో ఇజ్రాయెల్ జ్యువెలరీ సంస్థ ప్రపంచంలోనే ఖరీదైన మాస్కులను తయారు చేసింది. దీని ధర 1.5 మిలియన్ డాలర్లు కాగా.. మన కరెన్సీలో ఇది రూ.11.2కోట్లు. మొత్తం 18 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన ఈ మాస్కుపై 3600 తెలుపు, నలుపు రంగు వజ్రాలను అమర్చారు. ఎన్-99 ఫిల్టర్లను పెట్టారు. వైవెల్ జ్యువెలరీ కంపెనీ ఈ మాస్కును రూపొందించింది. అమెరికాలో నివాసం ఉండే ఓ చైనా వ్యాపారవేత్త ఈ మాస్కును ఆర్డర్ ఇచ్చినట్టు సంస్థ తెలిపింది.

ఆ వ్యాపారవేత్త లాస్ ఏంజెల్స్‌ లో ఉంటున్నారని చెప్పారు కానీ, పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఈ మాస్కు సర్జికల్ మాస్కు కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ బరువు ఉంటుందట. దీని బరువు 270 గ్రాములు. ఈ మాస్కు చేయటానికి దాదాపు నాలుగు నెలల వరకు తీవ్రంగా శ్రమించినట్లు సంస్థ వెల్లడించింది. ఆగస్టులో ఈ మాస్కు వివరాల గురించి సదరు సంస్థ యజమాని వెల్లడించారు. నగల తయారీ సంస్థ యజమాని లెవీ మాట్లాడుతూ.. డబ్బులుంటే ప్రతిదీ కొనుక్కోగలం.. చాలా ఖరీదైన కోవిడ్-19 మాస్కు కొనుగోలు చేసి ధరించడంలో సంతోషం ఉందని, దీని వల్ల చుట్టుపక్కలవారి దృష్టిని ఆకర్షించవచ్చనేది తమ ఉద్దేశమన్నారు.

కరోనా లాక్ డౌన్ వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇటువంటి ఖరీదైన మాస్కు చేయటంపై తప్పుడు సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ మాస్కు తయారు చేయటంలో తమకు పనికల్పించారని దీనిని తయారు చేసిన లెవి తెలిపారు. ఈ మాస్కు తయారీకి మొత్తం 25 మంది పనివాళ్లు శ్రమించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news