కరోనా రోగుల కోసం జొమాటో మొదలెట్టిన ఎమర్జెన్సీ ఫీచర్.. ప్రశంసిస్తున్న నెటిజన్లు..

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఆందోళనని కలగజేస్తున్నాయి. రోజువారిగా వస్తున్న కేసులు సరికొత్త రికార్డుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరిదీ. అలాగే కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపించకుండా అవసరమైన సాయం చేయడం ఉత్తమం. తాజాగా జొమాటో తీసుకొచ్చిన నూతన ప్రతిపాదన నెటిజన్ల మన్ననలు పొందింది. కరోనాతో బాధపడుతున్న వారికోసం ఎమర్జెన్సీ ఫీచర్ డెలివరీని తీసుకొచ్చింది.

దీనివల్ల కరోనా రోగులకి తక్షణమే ఆహారం డెలివరీ అందజేయబడుతుంది. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ, కరోనా రోగుల కోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్ ని అనవసరంగా వాడకూడదని, కరోనా రోగులకి సాయం అందేలా చూడాలని అన్నారు. ఈ మేరకు రెస్టారెంట్లలో ఫుడ్ ఎప్పుడూ రెడీగా ఉంటుందని, డెలివరీ కోసం బాయ్స్ కూడా అనునిత్యం అందుబాటులో ఉంటారని తెలిపింది. ఇలా వచ్చే డెలివరీలన్నీ కాంటాక్ట్ లెస్ గా ఉండనున్నాయట. కస్టమర్ కి డెలివరీ వారికి మధ్య ఎలాంటి కాంటాక్ట్ ఉండకుండా జరుగుతాయని పేర్కొంది.

దీన్నొక ఎమర్జెన్సీ అంబులెన్స్ గా వాడాలని, అనవసరంగా దుర్వినియోగం చేయరాదని ట్విట్టర్ వేదికగా దీపిందర్ గోయల్ చెప్పుకొచ్చారు. జొమాటో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా టైం లో ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకురావడం జనాలకి బాగా పనిచేస్తుందని, అందరికీ సాయపడే ఈ కొత్త విధానం చాలా మేలైనదని అన్నారు. ఈ ప్రతిపాదన వెనక పాటుపడుతున్న రెస్టారెంట్లకు డెలివరీ చేసే వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్ళవల్లే ఇది సాధ్యమవుతుందని అన్నాడు.