ఇషిక మళ్ళీ రావా..? నీ కోసమే నా నిరీక్షణ

ఇషిక.. నా ప్రాణం, నా సర్వస్వం. ఇప్పటికీ తను నాతోనే ఉన్నట్లనిపిస్తుంది. ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చవి చూపిన నా ప్రేయసి.. ఇషిక మళ్ళీ రావా.. నీ కోసమే నిరీక్షిస్తున్నా… వస్తావు కదూ…

మనం అనుకున్న పనులన్నీ జరిగితే ఇంకా అది జీవితమెందుకవుతుంది.. చిన్నప్పటి నుండి నాకు కష్టం అంటే తెలియకుండా పెంచారు అమ్మా, నాన్న. అలాంటి నాకు ఆ అమ్మాయి దూరం అయ్యాక కష్టం అంటే తెలిసింది. ఏ కన్ను పడిందో మాపై.. నువ్వు లేకుండా నేనుండలేనన్నావు కదా… మరి ఎందుకు దూరమయ్యావ్‌..

నేను కాలేజిలో చదివే రోజుల్లో లైఫ్ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేది. అంత సంతోషంగా ఉన్న సమయంలో పరిచయమైనది ఇషిక. తన పరిచయం నా జీవితంలో మరువలేను. నాతో చాలా స్నేహంగా ఉండేది. తన సౌందర్యం, మంచితనం, సేవా గుణం నాలో తెలియని ఇష్టం ఆమె పట్ల కలిగింది. అలా రోజులు సాగిపోతున్నాయి. ఆమెను చూడ కుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. ఇక లాభం లేదని ఒక రోజు నా ప్రేమ విషయం ఆమెకు చెప్పేశాను. దానితో ఆమె కొన్ని రోజులు నాతో మాట్లాడలేదు. తర్వాత నాకు ఒకే చెప్పింది.

దానితో నా ఆనందానికి అవధులు లేవు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నాతో పెళ్ళికి రెడీ అని చెప్పింది. ముందు మా ఇంట్లో నా ప్రేమ గురించి చెప్పాను. అసలే ఒక్కగానొక్క కొడుకుని కనుక చిన్నప్పటి నుండి నేను అడిగినవన్ని ఇచ్చేవారు. మా వాళ్ళు మొదట్లో వద్దన్నా తరువాత జులాయిగా ఫ్రెండ్స్‌తో తిరిగే నేను పద్దతిగా మారడం వెనుక ఇషికనే కారణం అని తెలిసి సరే అన్నారు. వాళ్ళే వెళ్లి ఆ అమ్మాయి అమ్మ,నాన్న తో మాట్లాడారు. అయితే కులాలు వేరు అని వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక చేసేది లేక తిరిగి వచ్చారు. తరువాత కొన్ని రోజులకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ప్రేమ నిజమైతే అది ఎలాగైనా మనకు దక్కుతుందనిపించింది..ఇక ఇషిక, నేను చాలా హ్యాపీ.

బంధువులు అందరిని పిలిచి నిశ్చితార్థం కూడా చాలా బాగా చేసుకున్నాం. పెళ్లి పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. ప్రివెడ్డింగ్ షూట్‌ కూడా చేశాం.. హనీమూన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం.. తనకు ఇష్టమైన అనాధాశ్రమంలోని పిల్లలకు మా చేతనైనంత ఇచ్చాం.. మా పెళ్లికి వారం రోజులు మాత్రమే ఉన్నాయ్‌… తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వస్తుండగా రోడ్ ప్రమాదం..

అంతే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తనను ఐసీయయూలో ఉంచారు.. తను నన్ను చూడాలని కలవరిస్తుందని, నన్ను మాత్రమే లోపలికి పంపించారు.. నన్ను చూసిన ఇషిక సంతోషంగా నా చేతిని పట్టుకుని మాట్లాడింది.. తను మాట్లాడుతుందని కొంచెం సంతోషం.. హస్పటల్‌లోనే ఉన్నా రాత్రి మొత్తం.. తెల్లవారు జాము నాలుగు గంటలకి డాక్టర్‌ మళ్ళీ పిలిచాడు.. ఇషికను ఇంటికి తీసుకెళ్ళమని.. నాకేమీ అర్థం కాలేదు.. ఇషిక నన్ను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందని వచ్చిన సమాధానంతో నా గుండె పగిలి పోయింది.. ఇషికా.. ఇషికా.. ఇషికా..

దీని తో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. నా బాధ చూడ లేక మా అమ్మ అనారోగ్యానికి గురైంది. నేను ఆ బాధ నుండి బయట పడటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి ఇషికను నేను మరచిపోలేకపోతున్నా. మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. నేను మాత్రం ఇషిక స్థానంలో మరొకరిని ఊహించలేకపోతున్నా. ఇషిక మళ్ళీ రావా..?

– ఇషికా నందు