ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పీఠం కేసీఆర్ పెట్టిన భిక్ష అని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శనివారం శ్రీకారం చుట్టారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ఉద్యమం ద్వారా కేంద్రానికి స్థానిక నేతలు గుర్తొచ్చారన్నారు. ఫలితంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్న విషయం మరిచిపోవద్దన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు నెరవేరాలంటే దక్షిణ భారత దేశంలోని ఆరు రాష్ట్రాల బడ్జెట్ కేటాయించిన సరిపోదన్నారు. దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్ మరో సారి మోసపూరిత హామీలను ఇస్తోందని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్దమని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మహా కూటమికి ఓట్లు వేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. తెరాస నాలుగేళ్ల పాలనలో సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయన్నారు.