ఖైరతాబాద్ లోని శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవాసమితి ఆవిర్భావ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తూ, ఏ సామాజిక వర్గమైన ఐక్యతగా ఉంటే ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి పొందవచ్చని తెలియచేశారు. గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకులాగానే చూశాయని, రాజకీయంగా సరైన ప్రాధాన్యత కల్పించలేదని వెల్లడించారు మంత్రి తలసాని.
కోకాపేట లో యాదవులు, కుర్మలకు వేరువేరుగా సంక్షేమ భవనాల కోసం 5 ఎకరాలు చొప్పున భూమి, నిర్మాణం కోసం రూ. 5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసిందని, భవన నిర్మాణాలు పూర్తికావచ్చాయని తెలిపారు మంత్రి. యాదవులు ఎంతో గొప్పగా జరుపుకొనే సదర్ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు మంత్రి తలసాని. కృష్ణాష్టమి వేడుకలను కూడా అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సభలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవాసమితి అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్, అశోక్ యాదవ్, పాండు యాదవ్, మహేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.