పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెరాస ఆవశ్యకత చాలా ఉంది. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు…అందులో భాగంగానే కోటి ఎకరాల మాగాణి దిశగా ప్రణాళికలు రూపొందించిన విషయాన్నిగుర్తు చేస్తూ… కామారెడ్డి జిల్లా లింగంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ తెరాస కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ…. రైతుల పట్ల, వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల గురించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను రైతులు కొనియాడుతున్నారన్నారు. అందుకే తెలంగాణలోని రైతులు కేసీఆర్ను ‘కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు’ అంటూ సంబోధిస్తున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ప్రథమ ప్రాధాన్యం సాగునీటి ప్రాజెక్టులకేనన్నారు. మహాకూటమిలోని కాంగ్రెస్, తెదేపాలు.. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో 200 కేసులు వేశారని ఆరోపించారు. గత ఆరు దశాబ్దాల్లో అందని ప్రతిఫలాలు నాలుగున్నరేళ్లలో రైతన్నకు అందాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస విజయం చారిత్రక అవసరం అన్నారు.