మహిళలకు శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. నెల వారీ పూజల కోసం బుధవారం సాయంత్రం నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పుని అమలు చేస్తామని కేరళ సర్కారు చెప్పగా.. మరోవైపు సుప్రీం తీర్పుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కేరళతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే… ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే.. పరిణామలు తీవ్రంగా ఉంటాయని భారతీయ ధర్మ జనసేన, శబరిమల భక్త సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో శబరిమల పరిసరాల్లో హింస చోటు చేసుకునే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శబరిమలకు వచ్చే వాహనాలను నిలిపి ఉంచే నీలక్కల్‌కు ఇప్పటికే వేలాది మంది ఆందోళనకారులు చేరుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తే.. నిత్యం ఆలయ శుద్ధి ప్రక్రియ పుణ్యాహ వచనం చేయాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి ఆలయాన్ని నిరవధికంగా మూసేయాలని పూజారులు, రాజకుటుంబీకులు భావిస్తున్నారు. అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల్లో భయాందోళన నెలకొంది.