అగ్నికీలల్లో ఆస్ట్రేలియా – కాగుతున్న కన్నీళ్లు

-

దాదాపు 800 డిగ్రీల సెల్సియస్‌ వేడి. కిలోమీటర్‌ దూరంలో ఉన్నా, కబాబ్‌లయ్యే పరిస్థితి. ఆస్ట్రేలియా తీరమంతా మంటలు, పొగలే. ఊళ్లకు ఊళ్లే నాశనమయ్యాయి. కోట్లాది జీవాలు, వందలాదిమంది మనుషులు బూడిదైపోయారు.

ఈ చిన్నారి కంగారూ ఫోటో చాలు… గుండె కన్నీటితో నిండిపోవడానికి…

——————————————–

 

ఎటు చూసినా మంటలే. తాడిచెట్టెత్తు. వేగంగా వీస్తున్న గాలి. కోరలు చాస్తూ అడవులు, ఊళ్లు అనేదేదీ లేకుండా బస్మీపటలం చేస్తూ అంతకంతకూ ముందుకొస్తోంది. న్యూసౌత్‌ వేల్స్‌, విక్టోరియా, దక్షిణాస్ట్రేలియా రాష్ట్రాలు ఈ విపత్తులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు, బీచ్‌లతో సహా ఎక్కడా నరసంచారం లేకుండా అయిపోయింది.

ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం, 175 మంది ప్రజలు చనిపోగా, 48 కోట్ల మూగజీవులు బలయ్యాయి, 2000లకు పైగా ఇళ్లు బూడిదవగా, దాదాపు 500కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాలి బూడిదైన ప్రాంతం దాదాపు 2 కోట్ల ఎకరాలు లేదా 84వేల చదరపు కిలోమీటర్లు. కానీ పొగ చూరిన ప్రాంతం 70 లక్షల చదరపు కిమీ. ఆస్ట్రేలియాకు దావానలాలు కొత్తేమీ కాదు. కానీ ఇంత భయంకరంగా ఉండటం ఇదే ప్రథమం. అద్భుత అందాలతో అలరారే ప్రకృతికి నిలయమైన ఆస్ట్రేలియాకు ప్రతి సంవత్సరం లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈసారి కూడా అలాగే వచ్చి మంటల్లో చిక్కుకున్నవారెందరో.

ఏ ఊరు చూసినా, రెడ్‌ ఫిల్టర్‌ పెట్టి ఫోటో తీసినట్టు, అంతా ఎర్రగా కనిపిస్తోంది. అసలు సాధారణ రంగులలో అక్కడ ప్రపంచమే లేదు. బూడిదయిన జీవాల ఆనవాలే లేకపోగా, దూరం నుంచి తగిలిన వేడికి కమిలి, కాలిపోయి, ఆకారంతో సహా మిగిలిన కళేబరాలు ఎన్నో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఒకప్పుడు పచ్చని ప్రకృతితో కళకళలాడిన ప్రాంతాలన్నీ బొగ్గు గనులుగా మారిపోయాయి. అతిభయంకరమైన వాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌, బూడిద రేణువులు పీల్చి, తీవ్ర అస్వస్థతకు గురైన ప్రజలు వేలల్లో ఉన్నారు. అందులో అగ్నిమాపక సిబ్బందే అధికం.

మంటలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో వేడి దాదాపుగా 800 డిగ్రీలు ఉంటుంది. ఈ కార్చిచ్చు వల్ల ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రోజువారీ ఉష్ణోగత్రలే 45 నుండి 49 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలైన కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్‌బోర్న్‌లు కూడా వేడి, పొగతో నిండిపోయాయి. మాటలకందని విషాదంలో ఆస్ట్రేలియా మునిగిపోయింది.

ప్రపంచదేశాలన్నీ సాయానికి ముందుకొచ్చాయి. అమెరికా, కెనెడా, న్యూజీలాండ్‌లు తమ అగ్నిమాపక బృందాలను, యంత్ర సామాగ్రిని పంపుతున్నాయి. ఇతర దేశాలు సహాయం కోసం అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చాయి. దాతలు విరివిగా విరాళాలిస్తున్నారు. అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సంస్థ కూడా సహాయానికి పిలుపునిచ్చింది.

 

దావానలం తర్వాత, అంతకుముందు ఉపగ్రహ చిత్రం

గుండెల్ని పిండేసే ఫోటోలు మరికొన్ని…

Mandatory Credit: Photo by Uncredited/AP/Shutterstock (10516541b)

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version