కేజీఎఫ్ 2 గుర్తుంది కదా ! అంటే ఆ రోజు రాకీభాయ్ సముద్రం పాలు చేసిన బంగారం అంతా ఏమయిపోయింది అన్న ఆసక్తికర చర్చ ఒకటి కొంత కాలం నడిచింది కూడా ! ఇప్పుడు ఆ సినిమా కథ రియల్ లైఫ్ లో జరిగితే ఎవ్వరో అలానే ఓ ఓడను ముంచేయ్యడమో లేదా మరొకటో ఇంకొకటో చేస్తే అప్పుడు తమకు అదృష్టం వరించడం ఖాయం అన్న విధంగా పరిణామాలను అంచనావేస్తూ, అతిగా ఊహిస్తూ కాకినాడ ప్రాంతంకు చెందిన మత్స్యకారులు కొత్తగా ఆశల వేట సాగిస్తున్నారు. అసని ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోయినా తుఫాను గాలులకూ, తీవ్రతకూ ఎదురెళ్లి మరీ తమ అదృష్టం పరీక్షించుకోవాలన్నది వారి తపన.
శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, ఎం.సున్నాపల్లి తీరానికి బంగారు రథం ఒకటి చేరుకోవడంతో ఇప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తుఫాను వేళ సముద్రంలో బంగారం లభ్యం అవుతుందన్న వదంతులతో చాలా చోట్ల సంబంధిత వేట సాగిస్తున్నారు మత్స్యకారులు. దీంతో అత్యంత ప్రమాదకర వాతావరణంలో కూడా బంగారు వేట ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. ఇంకా అసని తుఫాను తీవ్రత ఇవాళ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా వాటిని సైతం పట్టించుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి నిండు జీవితాలను సముద్రంకు అర్పణ చేసి అయినా బంగారం తెచ్చుకుంటామని కొందరు మత్స్యకారులు అంటున్నారు.
వాస్తవానికి ఈ పుకారు ఎలా లేచిందో కానీ దీని ప్రభాతంతో తుఫాను కన్నా వేగంగా మత్స్యకారులు చాలా చోట్ల సముద్ర గర్భంలో బంగారం వెలికి తీతకు బయలు దేరడం విచారకరం. ప్రస్తుతం కాకినాడ ప్రాంతం, ఉప్పాడ తీరంలో బంగారం అన్వేషణ సాగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇటువంటి వదంతులు నమ్మవద్దని పదే పదే స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.