భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 వాహక నౌక.. జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లి భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. దీంతో ఇస్రో విజయాల పరంపర కోనసాగుతోంది.
దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా దీన్ని రూపొందించారు. క్రయోజనిక్ ఇంజన్ కలిగిన నాలుగోతరం వాహకనౌక జీఎస్‌ఎల్వీ ఎఫ్11. జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని సైనిక సమాచార ఉపగ్రహంగా ఇస్రో పరిగణిస్తోంది.
కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను ఇది అందించనుంది. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి మరింత సులభం కానుంది. జీశాట్ 7ఏ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. 8 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. జీశాట్ 7ఏ.. భారత్ పంపిస్తున్న 35వ సమాచార ఉపగ్రహం. ఇస్రో విజయం పై భారత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.