హాజరుకానున్న అమిత్ షా
తెలంగాణలో పట్టు సాధించడమే లక్ష్యంగా భాజపా దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగానే నేడు కరీంనగర్లో ‘సమరభేరి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు హాజరై ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి సత్తా చాటాలని చూస్తోంది. సభను గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా ఉత్తర తెలంగాణ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షకు పైగా జనాన్ని ఈ సభకు సమీకరించేందుకు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భాజపా నాయకులు, బండారు దత్తాత్రేయ, బాబూమోహన్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు. కరీంగనర్ వేదికగా అమిత్ షా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం గురించి వివరించనున్నారు. తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణలో అవలంభిస్తున్న విధానాల పట్ల ప్రధానంగా విమర్శించనున్నారు.