వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని అన్నివిధాల ఆదుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మంత్రి మోదీ హామి ఇచ్చారు. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రాంతాలను ప్రధాని వీక్షించారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, గవర్నర్ పి.సదాశివం, కేంద్ర పర్యాటక మంత్రి ఆల్ఫోన్స్ ఉన్నారు. ఉదయం వాతావరణం అనుకూలించక పోవడంతో కొచిలోని నావెల్ చెస్ వద్ద వరద పరిస్థితి పై ఉదయం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా తాత్కాలిక వరద సహాయానికి గాను రూ. 500 కోట్ల రూపాయలను ప్రకటించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
సాయం ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
తెలంగాణ ప్రభుత్వం కేరళకు 25 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించింది. ఈ నిధులను కేరళ రాష్ట్రానికి వెంటనే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం అధికంగా జరిగినందు వల్ల నీటిని శుద్ధి చేసేందుకుగాను రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషన్లతో పాటు వరదల్లో చిక్కుకున్న వారి ఆకలిని తీర్చేందుకు తెలంగాణ ఫుడ్స్ తయారుచేసిన 100 మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో కేరళకు అందజేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10 కోట్ల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరులకును కేరళకు పంపాలని ఆదేశించారు.