శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ లోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని రాష్ట్ర అటవీ ,పర్యావరణ ,దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తనను గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చుతుందని ఆమె అన్నారు.
అలాగే దేవాదాయ శాఖ భూముల కబ్జాపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ జాతరను మంత్రి సీతక్కతో కలిసి విజయవంతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన శ్వేత పత్రం పైన వివాదాలు సృష్టించుతున్న టిఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వ నాయకుల యొక్క ఆస్తులు అధికారంలోకి రాకముందు ఎంత ….అలాగే అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఆస్తులు ఎంతనే దాని పైన కూడా శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు.