నగరంలోని ధర్నాచౌక్ ఎత్తివేతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేటి వరకు వివరణ ఇవ్వకపోవడంతో హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రిచవచ్చు కానీ పూర్తిగా అణచివేయరాదని న్యాయస్థానం పేర్కొంది. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ని ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతి వి.హనుమంతరావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
నగరంలో శాంతి భద్రతల నేపథ్యంలో ధర్నా చౌక్ ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వివరించారు. ఆయన వాదనతో ఏకీభవించనీ న్యాయమూర్తి ఎక్కడో ఊరు బయట ధర్నా చేసుకుంటే ఎవరు వింటారు? మనుషులు లేని అడవిలో సెల్ టవర్ నిర్మిస్తారా? అంటూ వారిని ప్రశ్నించారు. ప్రభుత్వం కౌటర్ దాఖలు చేయడానికి ఏడాది నుంచి గడువు కోరుతూనే ఉందని… ఆలస్యం ఎందుకు అవుతోంది అంటూ ప్రశ్నించిన కోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ వేయాల్సిందిగా ఆదేశించింది.