నేపాల్‌లో టిక్‌టాక్‌పై నిషేధం

-

ఇప్పటికే పలు దేశాల్లో నిషేధానికి గురైన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ తాజాగా నేపాల్లోనూ బ్యాన్ అయింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ఐటీ మంత్రి రేఖా శర్మ వెల్లడించారు. అయితే ఇది ఎప్పటినుంచి అమలులోకి వస్తుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ యాప్తో సమాజంలో సామరస్యం దెబ్బతినే అవకాశం ఉన్నందు వల్ల ప్రభుత్వం నిషేధం విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. నేపాల్ నిబంధనల ప్రకారం.. దేశంలో పనిచేస్తున్న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆదేశాలు అమలులోకి వచ్చిన మూడు నెలల్లోగా నేపాల్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. లేదా ప్రత్యేక ప్రతినిధిని తమ దేశంలో నియమించాలి. అంతేకాకుండా ఈ కంపెనీలు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. నిబంధనలు పాటించడంలో విఫలమైనా.. నేపాల్ అధికార పరిధిలో సరైన రిజిస్ట్రేషన్ లేకపోయినా మంత్రిత్వ శాఖకు మూసివేసే అధికారం ఉంటుంది.

టిక్‌టాక్ యాప్‌ను ఇప్పటికే మన దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ఈ షార్ట్ వీడియో యాప్‌కు మన దేశంలో భారీ క్రేజ్ ఉండేది. అయితే జాతీయ భద్రతా సమస్యల కారణంగా జూన్ 29, 2020న కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ యాప్ 2016 సెప్టెంబర్ నెలలో ప్రారంభంకాగా.. భారత్‌లో ఎక్కువ మందిని ఆకర్షించింది. ఈ టిక్‌టాక్ యాప్‌తో ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకుని సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. యాప్‌పై నిషేధం విధించిన తరువాత యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసుకుని.. ఆ క్రేజ్‌తో సెటిల్ అయిపోయారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version