వైఎస్సార్ పెన్షన్ కానుకను రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. జనవరి 1 ,2028 రూపాయలు 250, జనవరి 1, 2029 మరో రూ.250 పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ నెలకు రూ.3,000 వస్తోందని, 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తామే ఎక్కువ మందికి, ఎక్కువ మొత్తం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో స్కూల్ బాగోగుల కోసం రూ.2 వేలు కేటాయించి, మిగతా రూ.15 వేలను తల్లుల ఖాతాల్లో జమచేస్తామన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ చేయూత కొనసాగిస్తామని.. ఐదు సంవత్సరాలలో రూ. 1,50,000 వరకు పెంచుతామన్నారు. కాపునేస్తాన్ని రూ. 1,20,000 వరకు, ఈబీసీ నేస్తం రూ.లక్షా ఐదు వేల వరకు పెంచుతామని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.