తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో విశాఖలోని శారదా పీఠాన్నిసీఎం కేసీఆర్ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనం పొందారు. అనంతరం అక్కడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు సైతం ఆయన నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతికి పండ్లు, వస్త్రాలు సమర్పించి పూలమాల వేసి సత్కరించారు. పీఠంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరో యాగం నిర్వహించాలనే కేసీఆర్ ఆలోచనను పీఠాధిపతితో పంచుకున్నారు.
అది సహస్ర ఆయుత చండీ మహాయాగమా? మరో యాగమా అనేదానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంతోపాటు తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యాగాలను నిర్వహించారు. డిసెంబరు 2015లో తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం , రాజశ్యామల యాగం జరిపించారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ త్వరలోనే మరో యాగం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.