సద్దుమణిగిన వివాదం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో నిధుల దుర్వినియోగంపై చెలరేగిన వివాదంతో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేష్ రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే..దీనికి సంబంధించి ఒకరిపై మరొకరు ఆరోపణలు సైతం చేసుకున్నారు. అయితే ఈ వివాదం మరింత ముదరకముందే సినీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. రెండు గ్రూపులుగా చీలిన ‘మా’ని ఒక్కటిగా చేశారు. ఈ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. రెండు వర్గాలు ప్రెస్ మీట్ పెట్టి పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పాటు ‘మా’ ఐక్యతను దెబ్బతినే విధంగా వ్యవహరించడంలో ఇద్దరు తప్పుచేశారన్నారు. నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇక నుంచి ఎలాంటి ఆరోపణలు వచ్చిన కలెక్టివ్ కమిటీ విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. మీడియాతో ఇక నుంచి కలెక్టివ్ కమిటీనే మాట్లాడుతుందని వివరించారు. శివాజీ రాజా, నరేష్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఎలాంటి విభేదాలు రాకుండా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ‘మా’ కుటుంబం అంతా ఒక్కటే..ఎలాంటి గ్రూపులు లేవు, మనస్పర్థలు లేవు అంటూ ఇరువురు కలిసి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.