రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎంపీ శశిథరూర్ అన్నారు. ఒక వేళ అతిపెద్ద పార్టీగా నిలిచినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్లు రాకపోవచ్చని, మిత్రపక్షాలు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడకపోవచ్చని శశిథరూర్ అన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై స్పందించారు. భారతదేశం భిన్నత్వంతో నిండిన దేశమని, రాష్ట్రాల మధ్య వందశాతం ఏకాభిప్రాయం లేదని ఆయన చెప్పారు.
ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకంపై స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఒప్పందం కుదురుతుందని తద్వారా ఓటమిని తప్పించుకోవచ్చు అని ఆయన తెలిపారు..28 ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి లో ఉన్నాయని.. అభ్యర్థిని నిలబెట్టడానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇద్దరు లేదంటే ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటారని,సీట్ల పంపకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే కూటమిలోని పార్టీలు కలిసిపోటీ చేశాయని తెలిపారు.