కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే 14 రోజులు గడిచిపోయాయి. లాక్‌డౌన్ గడువు ముగిసేందుకు ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే దేశంలో లాక్‌డౌన్ పెట్టకపోయి ఉన్నా.. సోషల్ డిస్టాన్స్‌ను పాటించకపోయినా.. నెల రోజుల్లో ఒక కరోనా రోగి 406 మందికి వైరస్‌ను వ్యాప్తి చెందిస్తాడట.. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో గనక లాక్‌డౌన్‌ను పెట్టకపోయి ఉంటే.. సామాజిక దూరాన్ని పాటించకపోయి ఉంటే.. ఒక కరోనా రోగి 30 రోజుల్లో 406 మందికి ఆ వైరస్‌ను అంటిస్తాడని.. అప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరిగి ఉండేదని.. తెలిపారు. ఈ మేరకు Indian Council of Medical Research (ICMR) ఓ అధ్యయనం చేపట్టిందని ఆయన తెలిపారు. సదరు అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం R0 (R naught) 1.5 నుంచి 4 మధ్య ఉందని అన్నారు. R naught అంటే.. ఇన్‌ఫెక్షన్ ఉన్న ఒక రోగి ద్వారా వైరస్ సగటున ఎంత మందికి వ్యాపిస్తుందని లెక్కిస్తూ.. చెప్పే ఓ గణిత ఫార్ములా. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఒక కరోనా రోగి ద్వారా వైరస్ సగటున 1.5 నుంచి 4 మందికి వ్యాపిస్తుందని అర్థం.
అయితే లాక్‌డౌన్, సామాజిక దూరం, ఇతర కఠిన చర్యలను అమలు చేయకపోయి ఉంటే.. దేశంలో ఇదే R naught ఇంకా ఎక్కువ ఉంటుందని లవ్ అగర్వాల్ తెలిపారు. అదే R naught 2.5 గా ఉంటే.. ఒక కరోనా రోగి 30 రోజుల్లో 406 మందికి వైరస్‌ను అంటిస్తాడని తెలియజేశారు. అయితే లాక్‌డౌన్, సామాజిక దూరం, ఇతర చర్యల వల్ల ఇన్‌ఫెక్షన్‌ను 75 శాతం వరకు తగ్గించ గలిగితే.. అప్పుడు ఒక వ్యక్తి వల్ల అదే 30 రోజుల సమయంలో వైరస్ కేవలం 2.5 మంది వ్యక్తులకు మాత్రమే వ్యాప్తి చెందుతుందని.. ICMR తెలిపిందని.. ఆయన పేర్కొన్నారు. అందువల్ల లాక్‌డౌన్‌ను ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
కాగా మంగళవారం వరకు దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,421 ఉండగా, మొత్తం 114 మంది చనిపోయారు.