ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో లక్ష ఎకరాల భూకుంభకోణం జరిగిందా.. ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ ఇది. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ జిల్లాలో కొన్ని రోజులుగా పర్యటిస్తున్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ భూకుంభకోణానికి సంబంధించిన వివరాలు సేకరించారు.
కడప జిల్లా రాజంపేట రెవిన్యూ డివిజన్ లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని బీవీ రాఘవులు తీవ్రంగా ఆరోపించారు. రాజంపేట, బద్వేలు, కాశినాయన, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల పర్యటన సందర్భంగా ఆయన పలువురు ప్రజలు, ప్రజా సంఘాలతో మాట్లాడారు. వారి నుంచి వివరాలు సేకరించారు.
ప్రభుత్వ భూమిని కాపాడటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాఘవులు ఆరోపించారు. అప్పటి ఓ కలెక్టర్ దీనిపై పూర్తి నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేసిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయినా ఈ లక్ష ఎకరాల భూకుంభకోణంపై దృష్టి పెట్టాలని ఆయన కోరుతున్నారు.
లక్ష ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై అప్పనంగా పట్టాలు చేసి ఇచ్చారని రాఘవులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయంతో సంబంధం లేని వారికి కూడా రెవిన్యూ అధికారులు పట్టాలు అందించారని ఆరోపించారు. భూ కుంభకోణంపై గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు విచారణ జరిపించారని తెలిపారు. కడప జిల్లాలో భారీగా జరిగిన భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానని బీవీ రాఘవులు తెలిపారు.