మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా జవాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలుడు కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే బ్యాంకులో రూ.10 లక్షలను దోచుకెళ్లాడు. ఈ సంఘటన అక్కడ సంచలనం సృష్టిస్తోంది. బ్యాంకులో అమర్చబడిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన మీదట పోలీసులు షాకయ్యారు. 10 ఏళ్లు బాలుడు ఎవరూ చూడకుండా అంత భారీ మొత్తాన్ని కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే దోచుకెళ్లాడంటే పోలీసులు కూడా నమ్మలేకుండా ఉన్నారు.
జవాద్‌లోని కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఉదయం 11 గంటలకు ఓ బాలుడు వచ్చి క్యాషియర్ కౌంటర్ వద్ద ఉన్న డెస్క్ వద్ద దాక్కున్నాడు. అతను చాలా పొట్టిగా ఉండడంతో ఇతర కస్టమర్లెవరూ గుర్తించలేదు. అయితే క్యాషియర్ తన కౌంటర్ నుంచి అవతలికి వెళ్లగానే.. అదును చూసి ఆ బాలుడు అక్కడే ఉన్న రూ.500 నోట్ల బండిళ్లు మొత్తం రూ.10 లక్షలను దోచుకెళ్లాడు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఆ బాలుడు ఆ దొంగతనం చేశాడు. అతను నగదు తీస్తున్నప్పుడు కూడా అటు బ్యాంకు సిబ్బంది గానీ, ఇటు కస్టమర్లు గానీ ఎవరూ చూడకపోవడం విశేషం.
అయితే ఆ బాలుడు క్యాష్ తీసుకుని వెంటనే బయటకు పరిగెత్తాడు. దీన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది వెంటనే అలారం మోగించారు. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ బాలుడి వెంటబడ్డాడు. అయినా అతను దొరకలేదు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి.. జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. అయితే ఆ బాలుడికి బ్యాంకులో కస్టమర్‌గా వచ్చిన ఓ వ్యక్తి సహకరించాడని పోలీసులు గుర్తించారు. అతను బ్యాంకులోనే 30 నిమిషాలు ఉన్నాక బాలున్ని లోపలికి పంపించి అంత తక్కువ వ్యవధిలోనే దొంగతనం చేయించినట్లు గుర్తించారు. ఇక ఆ బాలుడితో దొంగతనం చేయించిన వ్యక్తిది ఓ ముఠా అని పోలీసులు తెలుసుకున్నారు. వారు గత కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించి మరీ బ్యాంకులో ఆ బాలుడితో దొంగతనం చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ బాలుడితో సహా ఆ ముఠా కోసం వెదుకుతున్నారు.