ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని వందేళ్ల వృద్ధురాలు ఓడించింది. వైరస్‌తో బాధపడుతున్న వారికి, కొవిడ్‌వారియర్స్‌కు ఆమె ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. గౌహతిలోని హాతిగాన్ ఏరియాలోని వృద్ధాశ్రమంలో ఉంటున్న వందేళ్ల మాయిహ్యాండిక్‌తోపాలు 75ఏళ్ల మరో మహిళకు ఈ నెల7వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వెంటనే వారిని మహేంద్ర మోహన్ చౌదరి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందారు. ఈ నెల 15న మళ్లీ వారికి పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. దీంతో వారిని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా వారిని సిబ్బంది సన్మానించారు. తమకు ఎంతో మానసిక స్థైర్యాన్ని కల్పించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంతబిస్వాశర్మ ట్వీట్ చేశారు. చికిత్స చేస్తున్న డాక్టర్లకు ఆమె ఎంతో సహకరించారని, కరోనా వైరస్‌ను ఆమె ఓడించిందని, తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆ ట్వీట్‌లో ఆయన పొగిడారు. కాగా, అస్సాం రాష్ట్రంలోనూ కరోనా వైరస్ రెచ్చిపోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,46,575 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 1,16,900మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.