భారత్‌లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి ప్రభావం తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే వేలాదిమంది వైరస్‌కు బలయ్యారు. ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కూడా వైరస్‌బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే.. కొవిడ్-19బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లపట్ల ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమంటూ లేఖ రాసింది. భారత్‌లోలాగా మరే ఇతర దేశంలోనూ వైద్యులు ప్రాణాలు కోల్పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌లో ఇప్పటివరకు 382మంది వైద్యులు కరోనాతో మృతి చెందారని ఆ లేఖలో ఐఎంఏ పేర్కొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కొవిడ్‌వారియర్స్‌కు అండగా ఉండాలని కోరింది. అంతేగాకుండా.. ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.