కరోనా పట్ల చాలా మంది నిజానికి చాలా భయపడుతున్నారు కానీ.. ధైర్యంగా ఉంటే అది మనల్ని ఏమీ చేయలేదని అనేక మంది నిరూపిస్తున్నారు. ఎంత తక్కువ వయస్సైనా, ఎక్కువ వయస్సు వారైనా సరే.. కరోనా బారిన పడి కోలుకుని మరీ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. కరోనా పట్ల భయపడాల్సిన పనిలేదంటున్నారు. తిరుపతిలోనూ 101 ఏళ్ల వయస్సున్న ఓ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తిరుపతికి చెందిన 101 ఏళ్ల మంగమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది రోజుల కిందట కోవిడ్ బారిన పడి అక్కడి స్విమ్స్‌లోని శ్రీ పద్మావతి వుమెన్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడంతో ఆమెను శనివారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాం మాట్లాడుతూ.. హాస్పిటల్‌లోని సిబ్బంది ఆమెను నిత్యం కంటికి రెప్పలా చూసుకున్నారని, ఆమెకు నాణ్యమైన వైద్య సేవలు అందించారని తెలిపారు.
మంగమ్మను కోవిడ్ నుంచి రక్షించి పూర్తిగా నయం చేసినందుకు గాను ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్లు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కనుక కోవిడ్ ఉంటే భయపడకండి. ధైర్యంగా ఎదుర్కొంటే మనమే దానిపై విజయం సాధిస్తాం.