వింతైన కోడ‌ళ్లు.. అత్తకు గుడి క‌ట్టి బంగారు విగ్ర‌హాన్ని పూజిస్తున్నారు..

-

సాధారణంగా అత్తా కోడళ్లు అంటే ఇద్దరికీ పడదు. అత్త చేసే పనిని కోడలు, కోడలు చేసే పనిని అత్త మెచ్చదు. అందువల్లే సహజంగానే కుటుంబాల్లో గొడవలు వస్తుంటాయి. అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఎంత పాపులర్‌ అంటే తెలుగు టీవీ సీరియల్స్‌ చాలా వరకు ఇదే కథాంశంతో నడుస్తుంటాయి. కానీ నిజానికి అత్తా కోడళ్లు అంటే పొట్లాటలు పెట్టుకునేవారిలా కాదు, కలసి మెలసి ఉండాలి. ఆ కోడళ్లు కూడా అదే నిరూపించారు. ఇంకాస్త దూరం వెళ్లి వారు ఏకంగా తమ అత్తకు చిన్నపాటి గుడి కట్టి అందులో ఆమె బంగారు విగ్రహం పెట్టి పూజిస్తున్నారు కూడా.

చత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌కు సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో బిలాస్‌పూర్‌-కోర్బా రోడ్డుకు సమీపంలో రతన్‌పూర్‌ అనే గ్రామం ఉంది. అక్కడ నివసించే రిటైర్డ్‌ టీచర్‌ శివప్రసాద్‌ తంబోలికి గీతా దేవి అనే భార్య ఉంది. ఆమెకు 11 మంది కోడళ్లు. 2010లో ఆమె చనిపోయింది. దీంతో ఆ కోడళ్లతోపాటు ఆ కుటుంబ సభ్యులు ఆమె లేని లోటును తట్టుకోలేకపోయారు. వెంటనే కోడళ్లందరూ కలిసి అప్పట్లోనే ఇంట్లో చిన్న గుడి లాంటిది కట్టారు. అందులో తమ అత్తకు చెందిన బంగారు విగ్రహం పెట్టారు. ఆ విగ్రహానికి బంగారు ఆభరణాలు అలంకరించారు.

అప్పటి నుంచి ఆ కోడళ్లు అందరూ తమ అత్తను దైవంగా భావించి పూజిస్తున్నారు. నిత్యం దైవానికి పూజలు చేసినట్లు తమ అత్త విగ్రహానికి కూడా వారు పూజలు చేస్తారు. ఇక భజన కార్యక్రమాలను కూడా అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. తమ అత్త చనిపోవడం తమను తీవ్రంగా కలచివేసిందని, అందుకనే ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇలా ఆమెను పూజిస్తున్నామని ఆ కోడళ్లు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి కోడళ్లు ఉండడం ఆ అత్త చేసుకున్న అదృష్టం. కానీ దాన్ని ఆమె అనుభవించకుండానే చనిపోవడం దురదృష్టకరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version