పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అన్యుహ ఘటన. కొంతమంది వారి పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు. పెళ్లి అనేకాదు ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఆహ్వాన పత్రిక అనేది తప్పనిసరి అయిపోయింది. పెళ్లికి ఇచ్చే ఆహ్వానపత్రిక అయితే శుభలేఖ అని అంటాం. వివాహ తంతులో ఈ శుభలేఖకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక శుభలేక అంటే ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు రకరకాల డిజైన్లతో తయారు చేయిస్తారు.. సాధారణంగా శుభలేఖ రెండు నుంచి నాలుగు పేజీలు ఉంటుంది. కొందరైతే.. ఒకే పేజీలోనే అన్ని వివరాలు వచ్చేలా కూడా కార్డులు వేయిస్తుంటారు.
ఈ శుభలేఖ సెలక్షన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఎవరి స్థోమతకు తగినట్లుగా రకరకాల డిజైన్లతో వీటిని తయారు చేస్తారు. మెుత్తానికి ఎన్ని డిజైన్లలో శుభలేఖను డిజైన్ చేసినా రెండు నుంచి నాలుగు పేజీలు మాత్రం దాటదు అనడం సర్వసాధారణం. కర్ణాటకకు చెందిన రచయిత పంచాక్షరప్ప తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 112 పేజీలతో వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించారు. అందులో తన పద్యాలు, కవితలు, వివాహ బంధాన్ని తెలిపే ఎన్నో ప్రత్యేకతలను వివరించారు. వివాహాలపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచేందుకే అలా తయారు చేశానని తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శిమోగా జిల్లాకు చెందిన రచయిత పంచాక్షరప్ప తన కుమార్తె వివాహ శుభలేఖ విషయంలో భిన్నంగా ఆలోచించారు. అందుకు తన రచనలనే ఆయుధంగా వాడుకున్నారు. ఏకంగా 112 పేజీల ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుగణాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ ప్రత్యేక కార్డులో పద్యాలు, కవితలు, వివాహ ప్రత్యేకతను తెలిపేలా రచనలు పొందుపరిచారు. వివాహాలపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచేందుకే ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారుచేయించినట్లు పంచాక్షరప్ప తెలిపారు. పంచరంగి పేరుతో ముద్రించిన ఈ శుభలేఖను ప్రత్యేక రంగులతో కూడిన ఆర్ట్ పేపర్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ శుభలేఖ కర్ణాటకలో హాల్ చల్ చేస్తోంది.