శుక్రవారం నెల్లూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సభ్యుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార సంఘాలను పటిష్టం చేస్తున్నామన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకార రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకువచ్చారని, పారదర్శకంగా సేవలను అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని 13 కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న కర్నూలు, కడప జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయన్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైద్యనాథన్ కమిటీ సిఫారసులను అమలు చేశారని.. ప్రస్తుతం నాబార్డు కన్సల్టెన్సీ సంస్థ సిఫారసులను ఆమోదించి బ్యాంకులకు ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడి అందించారని తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కూడా ఆర్థికంగా పటిష్టం చేస్తామన్నారు.