హైదరాబాద్ మహానగరంలో మరోసారి దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి కొందరు యువకులు కత్తులతో హల్‌చల్ చేశారు. ఏకంగా ఓ షాప్ యాజమానిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై సుమారు 15 మంది కత్తులతో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వీరికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌లో కొందరు యువకులు నిన్న అర్థరాత్రి పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ అనుకోకుండా కస్టమర్ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను అడ్డుకోబోయిన షాపు యజమానిపై 15 మంది యువకులు ఏకంగా కత్తులతో దాడి చేశారు.ఈ దాడిలో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.